13 March, 2026 | 1:49 AM

ఎస్‌హెచ్‌జీలకు ఆర్టీసీ అద్దె బస్సులేవీ?

13-03-2026 12:12 AM

మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు ఆర్టీసీ అద్దె బస్సులు అప్పగిస్తామని ప్రకటించి, ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో ఆ హామీ నెరవేర్చలేదు. హామీపైనా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక బృందాల బలోపేతం కోసం తీసుకొచ్చింది.

మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లాలైన మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ తర్వాత కొంతకాలం క్రితం నల్లగొండకు కూడా విస్తరించారు. ఒక్కో బస్సుకు అద్దె నెలకు రూ.77 వేలు చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీకి అద్దె బస్సుల పథకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఉమ్మడి నల్లగొండ పరిధిలోని రెండు జిల్లాలకు 150 మంది మహిళా సంఘాల చొప్పున ఎంపిక చేశారు.

రెండు జిల్లాల్లో 300 సంఘాలకు మొత్తం 300 బస్సులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇచ్చినందుకు ప్రభుత్వమే ఒక్కో బస్సుకు రూ. 77,220 అద్దె చెల్లించాలని నిర్ణయించింది. పలు జిల్లాల్లో రెండో ఫేజ్‌లో ఆర్టీసీ అద్దె బస్సులను ఇవ్వడానికి సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వం బస్సులను కొనుగోలు చేయడంతో పాటు బ్యాంక్ గ్యారంటీ ఇస్తోంది. రెండో ఫేజ్‌లో ఈ పథకం అమలైతే ఉమ్మడి జిల్లాలో 450 ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయించాల్సి ఉంటుంది.

అంటే దాదా పు 450 మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంఘాలు బలోపేతం అవుతాయని, ఆయా సంఘాల బాధ్యులు భావించగా, పథకం అమలు ఆలస్యమవుతుండటంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ పథకం అమలు ఎప్పటి నుంచి జరుగుతుందనేది ఆర్టీసీ సంస్థ వద్ద కూడా స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తే సంఘాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది.

 సువర్ణ, తిప్పర్తి, నల్లగొండ జిల్లా