2 July, 2026 | 3:09 AM

కరువైన కూలి పనులు

02-07-2026 02:16 AM

ఉపాధి హామీని పునరుద్ధరించాలని గ్రామస్థుల డిమాండ్

తిరుమలాయపాలెం, జూలై 1 (విజయక్రాంతి): మండల పరిధిలోని సుబ్లేడు గ్రామంలో ప్రస్తుత సీజన్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోవడంతో రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద వ్యవసాయ కూలీలు పూట గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను కూడా నిలిపివేయడంతో నిరుపేద కుటుంబాలు మరింత దయనీయ స్థితికి చేరుకున్నాయి. చేతిలో పైసా లేక, చేయడానికి పని లేక ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘వర్షాలు లేక పొలం పనులు లేవు. ఉన్న ఉపాధి హామీ పనులను కూడా నిలిపివేశారు.

ఇప్పుడు మేము బ్రతికేదెలా? ప్రభుత్వ అధికారులే మమ్మల్ని ఆదుకోవాలి‘ అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి సుబ్లేడు గ్రామంలో నిలిచిపోయిన ఉపాధి హామీ పనులను పునరుద్ధరించి పేద కూలీలకు ఉపాధి కల్పించాలని, ఆకలి కష్టాల నుంచి గట్టెక్కించే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు ప్రభుత్వ అధికారులను ముక్తకంఠంతో కోరుతున్నారు.