28-01-2026 09:51:41 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామ కారోబర్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ ను తొలగించడం పట్ల గ్రామస్తులు గ్రామ సర్పంచ్ తో పాటు ఎంపీడీవో గ్రామ కార్యదర్శిపై మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా ఇతర వ్యక్తిని కరోబార్ గా నియమించడం ఎంతవరకు సమంజసం అని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామ కార్యదర్శి కేవలం ఒకే వర్గానికి వత్తాసు పలుకుతూ గ్రామ సర్పంచ్ మాటలు వింటూ ఇష్టం వచ్చిన వ్యక్తులను తీర్మానం లేకుండా నియమించడం సరికాదని అలాంటివి మానుకోవాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు.
అధికారికంగా కరోబారుగా మనోహర్ ను నియమించినప్పటికీ అతని స్థానంలో ఇతర వ్యక్తిని నియమించడం విధులకు ఆటంకం కలిగించడమేనని వెంటనే ఆ వ్యక్తిని తొలగించాలని ఎంపిడిఓ ఆనంద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గీత లకు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అధికారికంగా మనోహర్ గ్రామపంచాయతీ కారోబార్ గా విధుల్లో ఉన్నారని ఆ వ్యక్తిని తొలగించడం సరికాదని వెంటనే గ్రామ కార్యదర్శి గీత మనోహర్ ను విధుల్లోకి తీసుకొని విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతేకాకుండా ఒక అధికారి ఏ వర్గానికి వత్తాసు పలకవద్దని ప్రజలకు అనుసంధానం ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేసే విధంగా ఉండాలని గ్రామ కార్యదర్శికి తెలిపారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో అభివృద్ధి కోసం వచ్చే నిధులను అన్ని వార్డు సభ్యులకు సమానంగా పంచాలని ఒకవేళ పంచనీయుల ఎంపీడీవో అధికారంతో ఇతర సభ్యులకు నిధులు విడుదల చేసే హక్కు ఉంటుందని అభివృద్ధికి ఎవరు కూడా ఆటంకం కలిగించవద్దని ఎంపీడీవో ఆనంద్ గ్రామస్తులకు తెలిపారు. హుకుం జారీ చేయకుండా గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శి వార్డు సభ్యులు గ్రామస్తులు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని రాజకీయ పరంగా గ్రామా అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని ఆయన తెలిపారు.