26-08-2025 12:10:10 AM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): రాబోయే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం కామారెడ్డి పట్టణం నుండి వినాయక నిమజ్జనానికి సంబంధించిన రూట్లలో తిరిగి నిమజ్జనం జరిగే టెక్రియాల్ల్ చెరువు వరకు వెళ్లి పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా జరుగుతాయని, ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటారని అన్నారు.
పండుగ వాతావరణంలో జరిగే ఈ ఉత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫైర్, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, మత్స్య శాఖ, ఆర్ అండ్ బి తదితర శాఖలు వారికి కేటాయించిన విధులను సక్రమంగా చేసి నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడవలసినదిగా ఆదేశించినారు.
ముఖ్యంగా వర్షాలు అధికంగా కురిచి టేక్రియాల్ చెరువు నిండుగా ఉన్నందున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశృతి కలగకుండా మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే విశ్వహిందూ పరిషత్ నాయకులను గణేష్ శోభాయాత్ర సందర్భంగా పూర్తిగా అధికారులతో సహకరించి నిమజ్జన కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా సహకరించాలని కోరారు.