calender_icon.png 26 August, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి గోరంత... ఆక్రమణ కొండంత!

26-08-2025 12:10:59 AM

-క్వారీ పరిధి దాటి వాడుకుంటున్న మిడ్ వెస్ట్ గ్రానైట్ యాజమాన్యం

-ఎన్‌ఎస్పి కాల్వను  మింగేసిన వైనం

-పాలేరు వాగు బఫర్ జోన్ కూడా ఆక్రమణ 

-ఇష్టారాజ్యంగా క్వారీ తవ్వకాలు

-అధికారుల నిర్లక్ష్యంతో ఆగనిమిడ్ వెస్ట్ గ్రానైట్ ఆగడాలు

సూర్యాపేట / కోదాడ, ఆగస్టు 25 (విజయక్రాంతి) : పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ కల్పిస్తామని ప్రజలను మభ్యపెట్టి మాయ మాటలు చెబుతూ ప్రభుత్వ అనుమతులు పొందుతుంటాయి పరిశ్రమల యాజమాన్యాలు. తదుపరి అనుమతులను అడ్డం పెట్టుకొని ప్రజా అవసరాలను పక్కకు పెట్టి అందిన కాడికి దోచుకుంటూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతుంటాయి.

సరిగ్గా ఇదే విధానమును కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామ శివారులో 192, 193, 202, 214 ,215 సర్వే నెంబర్ లలో  ఏర్పాటుచేసిన మిడ్ వేస్ట్ గ్రానైట్ అనుసరిస్తుందని స్థానికుల నుండి ఆరోపణలు వినవస్తున్నాయి. నల్లబండగూడెం, మంగలి తండా, చిమిర్యాల గ్రామాలకు ఉద్యోగ అవకాశాలు  కల్పిస్తాం, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెప్పిన మాటలు కార్యరూపం దాల్చలేదంటూ పరిశ్రమపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిశ్రమ విస్తరణకు గాను 9.87 హెక్టార్ల అనుమతి కోసం గత వారం నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ ను గ్రామస్తులెవ్వరికి సమాచారం లేకుండా నిర్వహించడం గమనార్హం. 

 ’హద్దు’ దాటుతున్న యాజమాన్యం..! 

మిడ్ వెస్ట్ పరిశ్రమ సుమారు 15 ఎకరాలకు మాత్రమే క్వారీ  అనుమతులు ఉండగా దాని హద్దులు దాటి వాడుకుంటున్నట్లు తెలుస్తుంది. సుమారు 45 ఎకరాలలో తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. అలాగే తవ్వకాల లోతులో సైతం పరిధి దాటి వెళ్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఈ క్వారీలో వచ్చిన వేస్ట్ మెటీరియల్ ను పాలేరు వాగు బఫర్ జోన్ లో పోసుకుంటూ వాగునే ఆక్రమిస్తున్నారు. దాని ఫలితంగానే 2024 ఆగస్టు 31న వచ్చిన వరదలకు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన రామాపురం వంతెన దెబ్బతిన్నదనే విషయమును బాహాటంగానే పలువురు చర్చించుకుంటున్నారు.

 ఎన్‌ఎస్పి కాల్వను మింగేశారు : 

క్వారీ పక్కన సర్వేనెంబర్ 202లో  ఎన్‌ఎస్పి కాల్వ ఉండగా దానిని ఆక్రమణ చేసుకొని దర్జాగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా క్వారీలో నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవని, బ్లాస్టింగ్ ను సైతం నిపుణులతో కాకుండా సాధారణ వ్యక్తులతో చేయిస్తూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 ఇష్టారాజ్యంగా  తవ్వకాలు :

మిడ్ వెస్ట్ క్వారీలో తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మీరు చేపడుతున్న బ్లాస్టింగ్లతో భూమి పొరల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలు పూడిపోయి బోర్ల ద్వారా నీళ్లు రాక పొలాలు పారడం కష్టతరంగా మారిందని, అంతేకాకుండా తవ్విన భారీ గుంతలు అలాగే వదలడంతో వాన నీరు అందులోకి చేరి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. క్వారీ కూడా రోడ్డుకి అతి సమీపంలో ఉండడం వలన గ్రామస్తులంతా ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు.   


పంట పొలాలు 

దెబ్బతింటున్నాయి. 

మా తండాకు 300 మీటర్ల దూరంలో ఉన్న మిడ్ వెస్ట్ గ్రానెట్ వల్ల మా గ్రామానికి, మా పంట పొలాలకు చాలా సమస్యలు వస్తున్నాయి. వారు చేసే బ్లాస్టింగ్స్ వల్ల ఇండ్ల గోడలకు బీటలు వస్తున్నాయి. దుమ్ము, ధూళి కారణంగా పంట మొక్కల ఎదుగుదల సక్రమంగా లేక దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. బోర్లలో నీరు కూడా సక్రమంగా రావడం లేదు. తండాకు వెళ్లే రోడ్డులో అధిక లోడుతో లారీలు తిరగడం పలితంగా ఆ రోడ్డు అధ్వానంగా తయారైంది. అధికారులు స్పందించి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి.

 ఎల్లయ్య, రైతు,                         మంగలి తండావాసి