12-11-2025 08:39:13 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తా..
అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శన..
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి..
వనపర్తి క్రైమ్: హైదరాబాద్ లో రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉందని, అందు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని త్వరలో కలిసి విజ్ఞప్తి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. బుధవారం అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అమరులైన 1969 తొలి దశ, 2000 -14 మలి దశ ఉద్యమకారుల స్మారకం కోసం నిర్మించిన అమర జ్యోతి కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని అమర జ్యోతి కేంద్రాన్ని ప్రజల సందర్శనం కోసం వెంటనే ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంగణంలో భారీ సమావేశ మందిరం, క్యాంటీన్, విశాలమైన ప్రదేశం, ఎస్కాలెటర్స్ ఉండటాన్ని ఆయన గమనించారు. అమర వీరుల స్మారక కేంద్రం నిర్మాణానికి ప్రణాళిక రూపోందించిన ప్రముఖ శిల్పి ఎం. వీ. రమణా రెడ్డి అమర జ్యోతి ప్రాంగణాన్ని దగ్గర ఉండి చిన్నారెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ గంటా జలంధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.