10-05-2024 12:57:42 AM
2019తో పోలిస్తే ఈ సారి తక్కువగా ఓటింగ్ శాతం
గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం తగ్గుదల నమోదు
ఈసీ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ, మే 9: దేశంలో ఎన్నికల పండుగ మొదలైంది. ఇప్పటివరకు మూడు విడతల్లో 283 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే ప్రతి విడతకు రిజిస్టర్ ఓటర్ల సంఖ్యతో పాటు పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేస్తూ వచ్చింది. రిజిస్టర్ ఓటర్ల జాబితా విడుదలలో మొదటి రెండు విడతల్లో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మూడో దశలో పోలింగ్ రోజే వెల్లడించింది. ఈ గణాంకాలతో పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని కచ్చితంగా లెక్కించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కల ఆధారంగా 2019తో పోలిస్తే ఓటర్లలో అలసత్వం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గిందనే చెప్పాలి.
2019 ఎన్నికల కన్నా తక్కువా..?
దీనికి సూటిగా సమాధానం అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మూడు దశల్లో 283 స్థానాల్లో పోలింగ్ జరిగింది. గుజరాత్‌లోని సూరత్‌లో అసలు పోలింగ్ జరగలేదు. అక్కడి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జమ్ముకశ్మీర్‌లోని రెండు నియోజకవర్గాల్లోని ఓటింగ్ శాతాన్ని గతంతో పోల్చేందుకు వీలులేదు. అక్కడ డీలిమిటేషన్ ద్వారా చాలా మార్పులు జరిగాయి. ఇక మిగిలిన 280 నియోజకవర్గాలను పరిశీలిస్తే ఈ ఏడాది 65.75 శాతం నమోదైంది. అదే 2019లో నియోజకవర్గాల్లో కలిపి సగటు 68.84 శాతం (దాదాపు 3 శాతం తక్కువ) ఓట్లు పడ్డాయి.
పార్టీలపై ప్రభావమెంత..?
280 నియోజకవర్గాల్లో ఈ సారి 4.94 కోట్ల మంది నమోదు చేసుకోగా అందులో 3.24 కోట్ల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఏడాదితో పోలిస్తే ఇది 2.4 శాతం అధికం. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఓటర్ల సంఖ్యలోనూ చాలా నెమ్మదిగా వృద్ధి నమోదైందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే 97 సెగ్మెంట్లలో భారీస్థాయిలో ఓటింగ్ తగ్గింది. ఇందులోని 67 నియోజకవర్గాల్లో 2 శాతానికిపైగా, 33 స్థానాల్లో 5 శాతానికి పైగా, 5 స్థానాల్లో 10 శాతానికిపైగా ఓటింగ్ తగ్గడం గమనార్హం. నాగాలాండ్ (24.4 శాతం), మథుర (13.5 శాతం), పతానమిట్ట (11.7 శాతం), బాఘ్పట్ (11.1శాతం), సిద్ధి (10.7 శాతం) స్థానాలు పోలింగ్ శాతంలో తగ్గుదలలో టాప్‌లో ఉన్నాయి. 5 శాతానికి కన్నా ఎక్కువగా ఓటింగ్ తగ్గిన 78 నియోజకవర్గాల్లో పోయినసారి 49 స్థానాల్లో బీజేపీ గెలవగా, 13 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే, ఈ తగ్గుదల ఎన్డీఏ కూటమికి ప్రతికూమైన పరిస్థితులు ఉంటాయని ఇప్పుడే చెప్పలేం.