కోరుట్లలో పోలీసులతో ఓటర్ల వాగ్వాదం
మొరాయించిన ఈవీఎంలు
40 నిమిషాలు పోలింగ్ కేంద్రంలోనే నిరీక్షణ
అసహనం వ్యక్తంచేసిన ప్రజలు
జగిత్యాల, మే 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించాయి. గంటల కొద్ది పోలింగ్ కేంద్రాల్లోనే వేచిచూసిన ఓటర్లు ఎన్నికల అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. జగిత్యాల నూతన ప్రభుత్వ ఉన్నత పాఠశాల 203వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటరు బారులు తీరగా.. 40 నిమిషాలపాటు ఈవీఎం మొరాయించింది. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో బూత్ నెం 160లో సాయంత్రం 4 గంటల నుంచి ఈవీఎం పని చేయకపోవడంతో పోలింగ్ కేంద్రంలో ఓటర్లు నిరీక్షించారు. ఎంతకూ ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. తాము వెళ్తామని చెప్తున్నా ఓటు వేసి వెళ్లాలని పోలీసులు పట్టుబట్టడంతో ఓటర్లు వాగ్వాదానికి దిగారు.




