8 April, 2026 | 8:27 AM

మెజార్టీ స్థానాలు మావే!

14-05-2024 01:47 AM

10 నుంచి 12 స్థానాల్లో గెలుపుపై కాంగ్రెస్ నేతల్లో ధీమా 

మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీ నుంచే పోటీ 

మూడు, నాలుగింటిలో త్రిముఖ పోరు 

కాంగ్రెస్ నేతల్లో అంతర్గత చర్చ

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళితో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామనే అంచనాతో ఆ పార్టీ నేతలున్నారు. ముస్లిం వర్గాల ఓట్లు బీజేపీకి వ్యతిరే కంగా.. కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయినట్లుగా చెబుతున్నారు. పోలింగ్ సరళని బట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 స్థానాల్లో విజ యం సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

14 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ప్రచార హోరు సాగించారు. మంత్రులు, సీనియర్ నాయకులను ఒక్కో పార్లమెంట్  నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు కూడా పార్టీ అభ్యర్థుల విజయం కోసం చెమటోడ్చారు. అయితే, క్షేత్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొంత పట్టు సడలిందని సొంత పార్టీ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఉండాల్సిన పోటీ.. అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీగా మారింది.

బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్.. బీజేపీకి మళ్లిందని, దీంతో బీఆర్‌ఎస్‌కే నష్టం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పట్టుసడలకుండా ఉందని, కొన్ని చోట్ల ఒకటి, రెండు శాతం పెరిగే అవకాశం ఉందని పార్టీకి చెందిన మరి కొందరు నాయకులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలను కచ్చితంగా కైవసం చేసుకుంటామని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

చేవెళ్ల, మహబూబ్‌నగ్, భువనగిరి, వరంగల్  నియోజక వర్గాల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ చివరకు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఒకటి, రెండు సీట్లలో కాంగ్రెస్‌దే పై చేయి అవుతుందని చెబుతున్నారు. ఇక కరీంనగర్, నిజామాబాద్‌పైన కూడా ఆశతో ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే చేతులెత్తేసిందని చెప్పుకోవాలి. కనీసం హైదరాబాద్ అభ్యర్థికి మద్దతుగా పెద్ద నేతలు ప్రచారానికి కూడా వెళ్లకపోవడం గమనార్హం. ఇక్కడ డిపాజిట్ తెచ్చుకోవడం కూడా పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు.