8 April, 2026 | 12:07 PM

నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు వెనక్కి !

08-04-2026 10:06 AM

విచార‌ణ చేశాక‌..ఫిర్యాదు వాప‌సు 

ఉన్న‌తాధికారుల దృష్టికి  తీసుకెళ్తామంటున్న గ్రామ‌స్తులు

తూప్రాన్: గ్రామ పంచాయ‌తీలో నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని ఫిర్యాదు చేయ‌గా, అధికారుల విచార‌ణ‌లో నిధుల దుర్వినియోగం నిజ‌మ‌ని ఉన్న‌తాధికారుల‌కు నివేదిస్తామ‌ని వెల్ల‌డించారు. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఫిర్యాదుదారులు తాము చేసిన ఫిర్యాదును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు డీఎల్‌పీవోకు చెప్ప‌డంతో ముక్కున వేలేసుకోవ‌డం గ్రామ‌స్తుల వంతు అయింది. తూప్రాన్ మండ‌లం వెంక‌ట‌ర‌త్నాపూర్ పంచాయ‌తీలో నిధులు దుర్వినియోగం అయ్యాయ‌ని కొంద‌రు యువ‌కులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో డీఎల్‌పీవో యాద‌య్య విచార‌ణ అధికారిగా విచార‌ణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో సైతం దుర్వినియోగం జ‌రిగిన‌ట్లు తేల్చారు.

అయితే అనూహ్యంగా ఫిర్యాదుదారులు త‌మ ఫిర్యాదును వెన‌క్కి తీసుకోవ‌డం వెనుక ఏం జ‌రిగివుంటుందోన‌ని అనుమానిస్తున్నారు. ఒక‌వేళ ఫిర్యాదుదారులు రాజీ ప‌డ్డారా లేక బెదిరింపుల‌కు త‌లొగ్గారా ? అనే ప్ర‌శ్న‌లు గ్రామ‌స్తులు సంధిస్తున్నారు. ఇదే విష‌య‌మై డీఎల్‌పీవో యాద‌య్య‌ను వివ‌ర‌ణ కోర‌గా నిధుల దుర్వినియోగం జ‌ర‌గ‌లేద‌ని చెబుతూ ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఓవైపు నిధుల దుర్వినియోగం జ‌రిగిన‌ప్పుడు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మ‌రోవ‌ర్గం వారు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది.