ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
- పోలింగ్ రోజున కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
జిల్లా అదనపు ఎస్పీ మహేందర్
మెదక్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) :మెదక్ మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని వేస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల అమరిక, బ్యారికేడింగ్ విధానం వంటి అంశాలను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి రవాణా సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాడల్ డే కేర్ సెంటర్ పోలింగ్ కేంద్రాన్ని, అలాగే దయరా, నవాబ్పేట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
ఓటర్లు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతంగా నిర్వహించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




