11 August, 2026 | 2:03 AM

వరంగల్ ఐటీఐని ‘హబ్’గా అప్‌గ్రేడ్ చేయాలి

11-08-2026 12:00 AM
  • పీఎం-సేతు కింద హాస్టల్ మంజూరు చేయండి

కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి వరంగల్ ఎంపీ 

డాక్టర్ కడియం కావ్య వినతి

వరంగల్, ఆగస్టు 10 (విజయక్రాంతి): వరంగల్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను పీఎం-సేతు పథకం కింద ‘స్పోక్’ నుంచి ‘హబ్’గా అప్గ్రేడ్ చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసి వివరించారు.

1959లో ఏర్పాటైన వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుతం సుమారు 1,402 మంది శిక్షణ పొందుతున్నారని ఎంపీ తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధికంగా ఉన్నందున సంస్థను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఎస్సీసీఎల్ భూపాలపల్లి, ఎన్టీపీసీ రామగుండం, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, కాజీపేట, వరంగల్ రైల్వేతో పాటు ఇతర పారిశ్రామిక రంగాల విస్తరణతో భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారీగా డిమాండ్ ఏర్పడనుందని వివరించారు.

ఐటీఐని హబ్గా అభివృద్ధి చేస్తే ఆధునిక సాంకేతిక పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, అప్రెంటిస్షిప్, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు. వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుతం ప్రత్యేక హాస్టల్ సదుపాయం లేదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు నిత్యం సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

పీఎం-సేతు కింద ఆధునిక శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల వసతి, భోజనం, పారిశుద్ధ్యం, చదువు తదితర సౌకర్యాలతో కూడిన హాస్టల్ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. వరంగల్ ఐటీఐని హబ్గా అప్గ్రేడ్ చేయడంతో పాటు హాస్టల్ భవనానికి ప్రాధాన్యం ఇచ్చి మంజూరు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని వరంగల్ ఎంపీ కావ్య కోరారు.