10 August, 2026 | 5:01 AM

గిరిజనుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నాం

10-08-2026 12:00 AM

భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి రాహుల్

భద్రాచలం, ఆగస్టు 9, (విజయక్రాంతి):కొండ కోనల్లో నివసించే ఆదివాసి  గిరిజనులు నాగరికత, సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంలో ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉందని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు అన్నారు.  భద్రాచలంలో ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో నివసిస్తూ వాగులు, వంకలు, అటవీ సంపదను కాపాడుకుంటూ జీవ నాన్ని పొందుతారని, అటువంటి  ఆదిమవాసుల గిరిజనులను ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశ జనాభా సంస్కృతి, సాంప్రదాయాలు పాటించి ఆదివాసి తెగ అంతరించిపోకుండా కాపాడుకున్న వారమవుతామన్నారు.

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా భద్రాచలం లోని ఆదివాసి గిరిజన భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.  ఆదివాసీల సంక్షేమానికి ఐటీడీఏ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ.. ఐటీడీఏ పీవో గా బాధ్యతలు చేపట్టి నుండి ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కొరకు అనేక విధాల కృషి చేశానని చిన్నారుల విద్యాభ్యాసం బలోపేతానికి ఉద్దీపకం ఒకటి రెండు ప్రవేశపెట్టడంతో పిల్లల యొక్క చదువు మెరుగు పడటంతో పాటు ఈ సంవత్సరం జిపిఎస్ పాఠశాలలో కొత్తగా 800 మంది పిల్లలు చేరారని అన్నారు.

అంతకుముందు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మరియు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్,  మరియు వివిధ ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి స్థానిక అంబేద్కర్ కూడలి దగ్గర ఉన్న ఆదివాసి తెగల గిరిజనుల కోసం పోరాడిన అమరవీరుల స్థూపాలకు పూలమాలవేసి,  అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.  డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందన, ఏవో సున్నం రాంబాబు,ఏసీఎంఓ రమేష్, ఏటిడిఓ రాధమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్,ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, గిరిజన సంఘాల నాయకులు  పాల్గొన్నారు.