12 August, 2026 | 2:49 AM

చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి

12-08-2026 12:26 AM
  1. కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డ్డ్డి తెచ్చిన కరువు?
  2. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  3. రేగొండ మండలం చెన్నపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆందోళన

భూపాలపల్లి/ రేగొండ,ఆగస్టు 11 (విజయ క్రాంతి): చలివాగు ప్రాజెక్టు నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం రేగొండ మండలం చెన్నపూర్ ఎక్స్రోడ్డు వద్ద చలివాగు నీటి విడుదల కోసం రైతులు చేపట్టిన రాస్తారోకోకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం శాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్టు, పంపుహౌస్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. చలివాగు తూములు ఎత్తి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని 1520 రోజులుగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

ప్రస్తుతం ఐదు, ఆరు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయని, మొత్తం తొమ్మిది పంపులను పూర్తి స్థాయిలో నడిపించాలని డిమాండ్ చేశారు. రైతులు నార్లు పోసి 45 రోజులు గడుస్తున్నా నీరు లేక నాట్లు వేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. తొమ్మిది పంపులు పనిచేస్తే నెలకు సుమారు ఆరు టీఎంసీల నీటిని పంపింగ్ చేయవచ్చని, తద్వారా పంటలకు నీరందడంతో పాటు తాగునీటి సమస్యను కూడా నివారించవచ్చన్నారు.

ప్రభుత్వం రైతుల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించిన ఆయన, 24 గంటల్లోగా చలివాగు నీటిని విడుదల చేయకపోతే రైతుల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల కన్నీటికి పాలకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని.. రేవంత్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కరువని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.