నిరుడు విడుదలైన ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా భవానీ శంకర్. తర్వాత ‘ధూత’ వెబ్ సిరీస్‌లో నాగచైతన్య భార్యగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ‘భీమా’ చిత్రంతో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ‘డెమోంటే కాలనీ2’ లో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రియా భవానీ పాల్గొన్న ఓ ప్రచార కార్యక్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పుడు రాజ్ అనే వ్యక్తి తన ప్రియుడని, అతనితో రిలేషన్‌లో ఉన్నానని తెలిపింది. ఈ తమిళ సోయగం చెప్పిన ప్రేమ, పెళ్లి ముచ్చట్లు ఇలా ఉన్నాయి.. ‘సినీ పరిశ్రమలోకి రాక ముందు నుంచే రాజ్‌తో నేను ప్రేమలో ఉన్నా. దాదాపు పదేళ్ల నుంచి మేం రిలేషన్‌లో ఉన్నాం.
పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అనుకున్నాం.. కానీ, సమయం దొరకలేదు. వచ్చే సంవత్సరం వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాం. మేమిద్దరం విడిపోయామని ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటిదాకా నేను చాలా మంది నటులతో కలిసి పనిచేశా.. వారితో ఏర్పడిన స్నేహం కారణంగా పుట్టిన రోజు, లేదా ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేదాన్ని. అలా, పోస్టు పెట్టడమే ఆలస్యం.. వారితో నేను రిలేషన్‌లో ఉన్నానంటూ వార్తలు వచ్చేవి. అదృష్టం కొద్దీ ఇప్పుడు ఆ నటులందరికీ పెళ్లి కూడా అయిపోయింది” ప్రియాభవానీ నవ్వుతూ చెప్పిందీ ఈ చెన్నై చందమామ.