ఎన్నాళ్లీ అన్యాయం?
- కృష్ణా జలాల్లో మన న్యాయబద్ధ వాటా ఎప్పుడు?
- 2015 నాటి ఒప్పందం ఆ ఒక్క సంవత్సరానికే
తుది కేటాయింపు జరిగే వరకు 50:50 వాటా కోరాలి
ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందు బలంగా వాదించాలి
చర్చల ద్వారా సమస్య పరిష్కారమైతే మరీ ఉత్తమం
కృష్ణా జలాల వివాదాలపై సమీక్షలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర విభజన తరువాత కృష్ణా జలాల కేటాయింపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 2015లో తాత్కాలి కంగా కుదుర్చుకున్న ఒప్పందం ఆ ఒక్క సంవత్సరానికేనని, కానీ నీటి కేటాయింపులో సంవత్సరాలుగా అన్యాయం జరు గుతూనే ఉందని జల వివాదాల కేసుల్లో తెలంగాణ తరఫున వాదనలను వినిపిస్తున్న న్యాయ నిపుణుల బృందం అభిప్రా యపడింది.
నిజానికి ఈ తాత్కాలిక ఒప్పం దం కూడా ఏకపక్షంగా నిర్ణయించారని ఆరోపించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో కృష్ణా జలాల వివాదాలు, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లపై న్యాయనిపుణులు సీఎస్ వైద్యనాథన్, సీనియర్ న్యాయవాదులు వీ రవీందర్‌రావు, తెలంగాణ రాష్ట్ర జల వనరుల సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఇతర న్యాయ బృందంతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నదీ జలాల వాటాలపై సమగ్రంగా చర్చించారు.
సగం వాటా కోరాల్సిందే
తెలంగాణ వాదనలకు నాయకత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్.. కృష్ణా ట్రిబ్యునల్2 (కేడబ్ల్యూడీటీ ముందు, అలాగే సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న వివిధ జల వివాదాలకు సంబంధించిన కేసుల గురించి ఈ సమావేశంలో వివరించారు. ఆయా కేసుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లా డుతూ.. ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే ఏకపక్షంగా 2015లో కృష్ణా జలాల్లో వాటాలు నిర్ణయించారని, అది ఆ ఒక్క సంవత్సరానికే పరిమితమని తేల్చి చెప్పారు. కానీ సంవత్సరాలుగా అదే అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై న్యాయ నిపుణుల బృందం మాట్లాడుతూ.. కేడబ్యూడీటీ ముందు వాటాలను పునఃపరిశీలన కోసం కోరామని, కనీసం 50:50 శాతంతో రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో వాటాలను పంచాలని, ఇది తుది పంపకం జరిగే వరకు కొనసాగాలని కోరినట్టు తెలిపారు.
తెలంగాణ హక్కులను కాపాడుతాం
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 12.2.2024 నాడు అసెంబ్లీతో ప్రభుత్వం స్పష్టమైన తీర్మానం చేసిందని.. ఆ రెండు ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను తప్పకుండా కాపాడుతామని, తెలంగాణ ప్రజల హక్కులను, నదీ జలాలను కాపాడుకుంటామని తేల్చి చెప్పారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కంచుకునేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని వైద్యనాథన్ తెలిపారు. దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. అదే సరైన మార్గమని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కృష్ణా బేసిన్‌లోని ప్రజల డిమాండ్‌ను సాధించి అక్కడి దుర్భిక్ష పరిస్థితులను తుడిచిపెట్టాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుల్లో ఉన్న కేసులపై రాజీ పడకుండా దూకుడుగా ముందుకు సాగాలని న్యాయ, టెక్నికల్ నిపుణుల బృందాలకు మంత్రి సూచించారు.






