శ్రీనగర్ పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతాం
తుదిదశకు చేరుకున్న అంతర్గత రోడ్ల నిర్మాణం
రూ. 50లక్షలతో బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేపడుతున్నాం
శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని
కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజావసరాల అనుగుణంగా అభివృద్ధి పనులు పూర్తిచేసి శ్రీనగర్ గ్రామపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దితామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని శ్రీనగర్ గ్రామపంచాయతీలో రూ.14.5ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పూర్తయిన రోడ్లు, డ్రైన్లను కూనంనేని ప్రారంభించారు. అనంతరం రూ.48లక్షల ఎస్సిపి, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి, రూ.50లక్షలతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి మంగళవారం కూనంనేని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా కూనంనేని మట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే వివిధ పథకాల్లో మంజురైన నిధులతో రోడ్లు, డ్రైన్ల, ప్రధాన రహదారుల నిర్మాణాలు పూర్తి చేశామని, పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. శ్రీనగర్ గ్రామపంచాయతీపై ప్రత్యేక ద్రుష్టి సారించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అంతర్గత రోడ్ల సమస్యను ముందస్తుగానే గుర్తించి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామన్నారు. బతుకమ్మ ఘాట్ నిర్మాణం విషయంలో గతంలో నిర్లక్ష్యం జరిగిందని, పండుగవేళ మహిళల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఘాట్ నిర్మాణంపై ప్రత్యేక ద్రుష్టి సారించి నిధులకు సిఫారసు చేయడం జరిగిందన్నారు. పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.






