22 March, 2026 | 4:36 AM

మా వల్ల కాదు.. మేం చేయలేం!

22-03-2026 01:22 AM
  1. చలాన్ల ఆదాయమంతా పోలీసులకు, నిర్వహణ మాత్రం మాకా?
  2. ట్రాఫిక్ సిగ్నల్స్, బస్టాపుల నిర్వహణ నుంచి తప్పుకునేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు
  3. చలాన్ల వసూళ్లలో వాటా ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో సత మతమవుతున్న జీహెచ్‌ఎంసీ.. అనవసరపు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. తమ విధులతో ప్రత్యక్ష సంబంధం లేని నిర్వహణ బాధ్యతల నుంచి మెల్లగా తప్పుకునేం దుకు పావులు కదుపుతోంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత ఇటీవల జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించడంతో బల్దియా ఆదాయ వనరులు పూర్తిగా పరిమితమయ్యాయి.

ప్రస్తు తం ఉన్న రూ.4,786 కోట్ల అప్పులకు అస లు, వడ్డీలు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్ష న్లు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు జీహెచ్‌ఎంసీకి తలకు మించిన భారంగా మారా యి. తమ విధులతో ఎలాంటి సంబంధం లేని ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, ఆర్టీసీ బస్టాపుల మెయింటెనెన్స్ బాధ్యతలను వదిలిం చుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 404 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి.

వీటి నిర్వహణ, మరమ్మతులు తదితర బాధ్యతలను బల్దియానే స్వయంగా చూసుకుంటోంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీపై ప్రతీ నెలా సుమారు రూ.50 లక్షల వరకు, అంటే ఏడాదికి రూ.6 కోట్ల మేర ఆర్థిక భారం పడుతోంది. తీవ్ర నిధుల లేమితో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం తమ వల్ల కాదని, ఈ బాధ్యతల నుంచి తమను తప్పించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

ఖర్చు మేమెందుకు భరించాలి?

ట్రాఫిక్‌కు అనుగుణంగా నగరంలోని వివిధ జంక్షన్లను విస్తరించడం, ట్రాఫిక్ ఐ లాండ్లను ఆధునికీకరించడం, సిగ్నలింగ్ వ్య వస్థను నిర్వహించడం కోసం జీహెచ్‌ఎంసీ ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. కానీ, ఈ సిగ్నల్స్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి చలాన్ల రూపంలో వస్తున్న భారీ ఆదాయం మొత్తం పోలీసు శాఖ ఖాతాలోకి వెళుతోం ది.

నిర్వహణ బాధ్యతలు, ఖర్చు తమదైనప్పుడు.. చలాన్ల ద్వారా వచ్చే ఆదాయంలో కనీసం కొంత శాతమైనా జీహెచ్‌ఎంసీకి వాటాగా కేటాయించాలని గత 14 ఏళ్లుగా బల్దియా అధికారులు కోరుతూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నాటి కమిషనర్ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. ప్రొఫెషనల్ ట్యాక్స్, మోటారు వెహికల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల వసూళ్లలో జీహెచ్‌ఎంసీకి వాటా ఇస్తున్న తరహాలోనే.. ట్రాఫిక్ చలాన్ల వసూళ్లలోనూ వాటా ఖరారు చేయాలని కోరుతున్నారు.