8 July, 2026 | 1:21 AM

ప్రతిపక్షాలపై ఉగ్రావతారం!

08-07-2026 12:36 AM
  1. విపక్షాలపై మంత్రి అడ్లూరి ఉగ్రరూపం
  2. బీఆర్‌ఎస్ ఆరోపణలపై  చురకలు
  3. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రతి సవాల్
  4. ఆసక్తికరంగా మారిన జిల్లా రాజకీయాలు

కరీంనగర్, జూలై 7 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైనది. ఇక్కడి నేతల మాటలు సంచలనం రేపుతుంటాయి. ఇటీవల కాలంలో  మంత్రి అడ్లూరి రాజీనామాకు సిద్దమంటూ ప్రతిపక్షాలపై సవాళ్లు విసురుతూ వార్తల్లోకి ఎక్కతున్నారు.   ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి (ఉగ్ర నరసింహస్వామి) ఆలయం ధర్మపురిలో ఉంది. ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న . మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ జకీయాల్లో ప్రతిపక్షాలపై ’ఉగ్ర రూపం’  దాల్చుతున్నారు.

ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్ ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా మండిపడుతున్నారు. గురుకుల పాఠశాలల టెండర్లలో రూ. 2000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై అడ్లూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆరోపణలను నిరూపిస్తే తాను తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే నిర్మించారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఆధ్యాత్మికంగా ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి పాటుపడటంతో పాటు, రాజకీయంగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఆయన ప్రతి సవాల్ కు రాజీనామా చేస్తా అని హెచ్చరించడం రాజకీయ చర్చకు దారి తీసింది. ఇటీవల ధర్మపురి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని  మంత్రి అడ్లూరి పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించిన సందర్భంలో నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వీటితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్లు మాయమైపోతున్నయని మాజీ మంత్రి ఈశ్వర్ ఆరోపించిన క్రమంలో మంత్రి లక్ష్మణ్  రాజీనామా చేస్తా అంటూ సవాల్  విసిరారు. ఒక సందర్భంలో. బీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్రావును ఉద్దేశించి ‘దొర’ అంటూ కులాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడటం  వివాదానికి దారితీసింది.

కుల రాజకీయం చేస్తున్నారని కొప్పుల మండిపడ్డారు.   ఏ రకమైన రాజకీయ సంస్కృతి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ధాన్యం కొనుగోలు సమయంలో జీవన్ రెడ్డి చేసిన ఆరోపణల సందర్భం లో కూడా  అడ్లూరి నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు.

తరచూ రాజీనామాల  ఆశ్రన్నీ ప్రయోగిస్తుండటంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు నిజంగానే అవినీతిపై మాట్లాడే ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని కొప్పుల ఈశ్వర్  ఇటీవల ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.  మంత్రి పదవిని వదులుకోవడం అంత సులభం కాదని.. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్కు రాజీనామా చేసేంత ధైర్యం అస్సలు లేదంటూ ఎద్దేవా చేయడం వీరిద్దరి మధ్య పొలిటికల్ వార్ ను పెంచింది.