22 March, 2026 | 9:31 AM

ఫారెస్ట్ అధికారులే టేకు దొంగలు!

22-03-2026 01:24 AM

ఆఫీసు డ్రైవర్, బీట్ ఆఫీసర్ చేతివాటం 

పెద్దగుల్ల నుంచి మద్నూర్ తరలింపు 

జుక్కల్, మార్చి 21 (విజయక్రాంతి): ఇంటిదొంగలను ఈశ్వరుడైన పట్టుకోలేడనే నానుడిని నిజం చేస్తూ జుక్కల్ ఫారెస్ట్ అధికారులు ఏకంగా టేకు కట్టెలపైనే కన్నేశారు. జుక్కల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పెద్దగుల్ల గ్రామం నుంచి పెద్ద ఏడ్గి మీదుగా మద్నూర్‌కు టేకు కట్టెలు ట్రాక్టర్‌లో నింపి అక్ర మంగా రవాణా చేస్తున్నారు. టేకు కట్టెలు మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి తీసుకు వెళుతున్నారని స్థానికులు ప్రశ్నించగా ఫారెస్ట్ అధికారులు చెపుతున్న తీరు విస్మాయానికి గురిచేసింది.

జుక్కల్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం మండల కేంద్రంలో ఉండగా మద్నూర్‌లో ఉన్న ఫారెస్ట్ కార్యాలయానికి కట్టెలు తరలిస్తున్నామంటూ బుకాయించడానికి ప్రయత్నం చేశారు. ఈ టేకు కట్టెలు గత కొన్నేళ్ల క్రితం ఒక రైతు తన ఇంటి కోసం తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. ఇది నేరమని, ఫారెస్ట్ రేంజ్ అధికారులు వెళ్లి చాలాన కట్టాలని ఆ తర్వాత తీసుకువెళ్లాలని సూచించారు. చాలానా డబ్బులు ఎక్కువ మొత్తంలో ఉండటంతో ఆ రైతు కట్టెలను అక్కడే వదిలేశాడు. అప్పటి నుంచి ఫారెస్ట్ అధికారుల కన్ను ఆ కట్టెలపై పడింది.

సరిగ్గా రేంజ్ అధికారులు సెలవుల్లో ఉన్న సమయంలోనే వాటిని ఒక బీట్ ఆఫీసర్, జీబు డ్రైవర్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి వాటిని కొద్ది రోజుల క్రితం మాయం చేసి సొమ్ము చేసుకున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆరా తీస్తే మద్నూర్‌లోని ఒక సామిల్‌లో కట్టెలను కోసి అమ్ముకున్నట్లు తెలిసిందని స్థానికులు చెపుతున్నారు. కట్టెల స్మగ్లర్లను పట్టుకోవాల్సిన అధికారులు వారే స్మగ్లర్లుగా మారితే ఏ విధంగా ఉంటుందో వీరికి చూస్తే అర్థమవుతుందని చులకనగా మాట్లాడుతున్నారు. ఇందులో వీరిద్దరి హస్తమే ఉందా లేకుంటే ఇంకా ఎవరిదైనా హస్తం ఉందా అనేది విచారణ చేపడితే తెలుస్తుందని గ్రామస్తులు చెపుతున్నారు.