ఎక్సైజ్ కమిషనర్‌పై కుట్రలు ఖండిస్తున్నాం
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్
ముషీరాబాద్,ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే అగ్రకులాల ఏకమై ఆయనపై దృష్ప్రచారం చేస్తున్నారని, ఆయనపై ఒక వర్గం చేస్తున్న కుట్రలు ఖండిస్తున్నామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్రంట్ ఛైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ లు మాట్లాడారు. నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి కావాలనే కమిషనర్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై కమిషనర్ ప్రశ్నించి ఉం డొచ్చని, కానీ ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ ఐఏఎస్ అధికారికి ప్రాంతీయ భేదం ఉండదని, కానీ ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెంది న వ్యక్తి అని మాట్లాడటం సరికాదన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఎక్సైజ్ కమిషనర్, చీఫ్ సెక్రెటరీగా ఉన్న సోమేశ్ కుమార్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ప్రశ్నించారు. శాఖాపరమైన అంశాన్ని రాజకీయం చేయొద్దని, కమిషనర్ పై జరిగే కుట్రను త్వరలో బయటపెడతామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో కన్వీనర్లు యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, ఎస్.దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరు శేఖర్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.




