16-12-2025 01:19:03 AM
పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు
మానకొండూరు డిసెంబరు 15(విజయక్రాంతి):ఇందిరమ్మ ఇళ్లు , నోట్ల కట్టలు బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం పై ప్రభావం చూపలేకపోయాయని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిలిచి గెలిచి సత్తా చాటామని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, ప్రజలకు, పార్టీ శ్రేణులకు, తదితరులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మానకొండూరు లోని బీ ఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, శంకరపట్నం, మానకొండూరు, గన్నేరువరం మండలాల్లో గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన వారితో ఆత్మీయ, అభినందన సమావేశం ఏర్పాటు చేశారు.
ఆత్మీయ ఆలంబనలు, విక్టరీ సంకేతాలు, కండువా ధారణలు, ఛాయాచిత్రాల సందడితో సమావేశం ఆసాంతం అట్టహాసంగా, కోలాహలంగా కొనసాగింది. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని మండలాలలో 90 శాతం స్థానాలు కైవసం చేసుకున్నామని, ఇది ప్రజల గెలుపన్నారు. ఇదే పంథా కొనసాగిస్తూ రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
చాలా మెజారిటీ స్థానాల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో గెలుపు వరకు వచ్చి నిలిచిపోయామన్నారు. గులాబీ పార్టీ ఓటు బ్యాంకు పల్లెల్లో నిలిచి ఉంటుందన్నారు. ఆత్మీయ, అభినందన సమావేశంలో తిమ్మాపూర్ మండల పరిధిలోని 11, గన్నేరువరం 2, శంకరపట్నం 11, మానకొండూరు 11 స్థానాల్లో విజయతీరాలకు చేరుకున్న సర్పంచులతోపాటు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు హాజరయ్యారు.