దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
132వ ‘మన్ కీ బాత్’ను వీక్షించిన బీజేపీ శ్రేణులు
మణికొండ, మార్చి 29 (విజయక్రాంతి) : దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మణికొండ, నెక్నాంపూర్ డివిజన్లలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఆదివారం 132వ ’మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ క్రికెట్లో టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలవడాన్ని, 70 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ కైవసం చేసుకోవడాన్ని కొనియాడారు.
యువత క్రీడల్లో రాణించడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు దోహదపడతాయని గుర్తు చేశారు. నాగాలాండ్ ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాలకు నేర్పిస్తున్న తీరును ప్రధాని ప్రశంసిం చారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మత్స్యకారుల పాత్ర కీలకమని, చేపల ఉత్పత్తి ద్వారా వారు ఆర్థిక పురోగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వాడకంపై దృష్టి సారించాలని సూచించారు. దేశంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, అభివృద్ధి పథంలో అందరూ కలిసి నడవాలని కోరారు. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొండకర్ల నరేందర్ రెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బి. రవికాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కంకణాల శివరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.




