11-08-2025 01:50:18 AM
మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ్యపటేల్
ఖైరతాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): సమగ్ర కులగణనలో మున్నూరుకాపులను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ జేసి చూపించిందని, రాష్ర్ట వ్యాప్తంగా సభ్యత్వ నమోదుతో తమ బలం, బలగాన్ని చాటుతామని తెలంగాణ మున్నూరుకాపు సంఘం (పటేల్) రాష్ర్ట అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మున్నూరుకాపు సంఘం రాష్ర్ట వ్యాప్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతకు ముందు కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి, బీసీల నేత పుంజాల శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ.. రాష్ర్ట జనాభాలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరుకాపులను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా తక్కువ చేసి చూపించిందన్నారు. తప్పుల తడకగా చేసిన కుటుంబ సర్వే వల్ల మున్నూరుకాపులు బీసీ జానాభాలో ఐదో స్థానానికే పరిమితమయ్యారన్నారు.
ఫలితంగా విద్య, ఉద్యోగ, రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించారని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కుబడిన సీట్లు కేటాయించడంతో పాటు కనీసం మంత్రి పదవీ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ర్టంలోని 33 జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతామని, తద్వారా మున్నూరుకాపుల సమగ్ర సర్వే నిర్వహిస్తామన్నారు.
తమ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టుకానుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేయమంటే ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తున్నారని, సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో మున్నూరుకాపులు అత్యధికంగా పోటీ చేయాలని కోరారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి మున్నూరుకాపు పాల్గొనాల ని, తమ పేరు చివరన పటేల్ అని రాయాలని సూచించారు. మాజీ కేంద్ర మంత్రి, బీసీ నేత, మున్నూరుకాపుల జాతిపిత పుంజాల శివశంకర్ కృషి ఫలితంగానే నాడు బీసీలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కాయని, ఆయన స్ఫూర్తితో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు బీసీలలోని అన్ని కులాలను, ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో తెలంగా ణ మున్నూరుకాపు సంఘం (పటేల్) గ్రేటర్ అధ్యక్షులు ఆర్వీ మహేందర్ కుమార్, రాష్ర్ట ఉపాధ్యక్షులు పి. రాజేశ్, సతీశ్, వెంకటేశ్ పటేల్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.