ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం
- బీడు భూములకు సాగునీరు అందిస్తాం
- ఎంపి మల్లు రవి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 19 (విజయ క్రాంతి) : ప్రజలు బాగుంటేనే మనం బాగుంటామని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం నగరంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపితో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ రైతుల యొక్క ప్రయోజనాలే తమకు ముఖ్యం అని ఆయన చెప్పారు.
అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. ఈ పరిస్థితి చూస్తే మళ్ళీ నాటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమమే గుర్తుకు వస్తుందన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చని తెలిపారు.
అన్ని విధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్, ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉండడమే కాదు అప్పట్లో కొత్త రాష్ట్రం కాబట్టి బ్యాంకులు విరివిరిగా సహాయం చేశాయని, ప్రస్తుతం పరిస్థితి అలా లేదని డబ్బు రీపేమెంట్ చేస్తే నిధులు బ్యాంకులు ఇవ్వలేవని, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో 5,6 వేల కోట్లు కేటాయించవచ్చు కాని వాటితో ప్రాజెక్టు పూర్తి కాదని కనీసం రూ 30 వేల కోట్లు కావాలని చెప్పారు. గత ప్రభుత్వం పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని విమర్శించారు.
అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశానికి హాజరై ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని పార్టీలు సమన్వయంతో ముందుకు వచ్చి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేకంగా చర్చించడం మంచి పరిణామణి ఐక్యంగా ముందుకు సాగితే ప్రతి పనిలో విజయం సాధిస్తామని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, షేక్ ఫరూఖ్ హుస్సేన్, జెఎసి నాయకులు బెక్కెం జనార్ధన్, వీరబ్రహ్మాచారి, జగపతి రావు, కార్పొరేటర్లు ఎంపి ప్రవీణ్ కుమార్, రమేష్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






