18 April, 2026 | 7:52 AM

ఇంటింటికి ఇంటర్నెట్ సేవలను టీ-ఫైబర్ ద్వారా అందిస్తాం...

08-12-2024 06:22 PM

ఇంటి నుంచే 150 రకాల పౌర సేవలు అందించేందుకు మీ సేవ యాప్ సిద్ధం

ఫైలెట్ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం

టీ- ఫైబర్ యాప్ ను ఆవిష్కరణలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలను టీ ఫైబర్ ద్వారా అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ లో టీ-ఫైబర్ యాప్ ను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గోన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సమీక్షంలో ఐటీ పరిశ్రమల శాఖ మన రాష్ట్రంలో రూ. 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆజాద్ ఇంజనీరింగ్, ప్రీమియర్ ఎనర్జీస్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్, లెన్స్ కార్ట్ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నాయని అన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు అందించే టి-ఫైబర్ యాప్ ద్వారా టెలిఫోన్, ఇంటర్నెట్, కేబుల్ టీవీ, కంప్యూటర్ వంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, వీటిని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా 3 పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి టీ ఫైబర్ యాప్, ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్స్ సౌకర్యాలు కల్పించామని, ఇందులో నుంచి వచ్చే అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు విస్తరిస్తామని అన్నారు. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా మొదటి సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అందిస్తామని అన్నారు. మీ సేవా  ద్వారా 150 రకాల పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో క్యూఎస్కే లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 

షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్లు సమీకృత కలెక్టరేట్లు, ఇతర ప్రాంతాలు ఇంటరాక్టివ్ క్యూఎస్కే ద్వారా ప్రజల పౌర సేవలు పొందవచ్చని, దరఖాస్తు నింపడం చెల్లింపులు చేయడం సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మీ సేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులు చేర్చిందని, పర్యాటక శాఖ హోటల్స్, పర్యాటక ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వయో వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ సర్టిఫికెట్ల జారి, అటవీ శాఖకు సంబంధించి వన్యప్రాణుల బాధితులకు సహాయం కొత్తవి జారి, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు తరలించేందుకు అనుమతులు వంటి సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. 

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్, టెలిఫోన్ కనెక్షన్ అందించినందుకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ వీర బుచ్చయ్య, జడ్పీ సీఈఓ నరేందర్, మంథని ఆర్డీవో సురేష్, తాహసిల్దార్ సుమన్, పీఏసీ ఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ ఎంపిటిసి దొడ్డ గీతారాణి, నాయకులు శశిభూషణ్ కాచే, మద్దెల రాజయ్య, వాజీద్ పాషా, అజీమ్ ఖాన్, తూటి రఫీ, బర్ల రాజు, జితేందర్ యాదవ్, అశోక్ చారి, గాదం శ్రీను, ప్రభాకర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.