బీసీ మహిళలకు సబ్ కోటా లేని బిల్లు మాకొద్దు
- కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలి
- సబ్ కోట కల్పించకపోతే 16న పార్లమెంటును ముట్టడిస్తాం
- మోదీ బీసీలకు ద్రోహం తలపెడుతుండు
- అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్, వీహెచ్, మధుసూదనాచారి, వీ శ్రీనివాస్ గౌడ్‌ల వెల్లడి
ముషీరాబాద్,ఏప్రిల్ 7(విజయక్రాంతి): అగ్రకుల మహిళల ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును ముందుకు తీసుకువస్తుందని, అందులో భాగంగానే ఈనెల16 నుండి18 వరకు డిల్లిలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లును అమ లులోకి తీసుక రావాలని కేంద్ర ప్రభుత్వం తహా తహా లాడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఈ మేరకు మంగళ వారం హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్‌లో మహిళా బిల్లు, బీసీ మహిళలకు సబ్ కోటా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ పై జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, మహిళా సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జాతి జన గణనలో బీసీ కులగన చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్వి భజన అలాగే మహిళా బిల్లును కేంద్ర ప్రభు త్వం ఎందుకు తీసుకువస్తుందని ఆయన ప్రశ్నించారు,
బీసీ కులాల లెక్కల వాటా తేలి న తర్వాతనే నియోజకవర్గల పెంపు, మహి ళా బిల్లు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు లేకుండా నియోజకవర్గలా పెంపు వలన, మ హిళా బిల్లు ఆమోదం వలన కేవలం అగ్రవర్ణ కులాలకే రాజకీయ ప్రయోజనం ఉం టుందే తప్ప బీసీలకు రాజకీయంగా ఎలాం టి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
మహిళా బిల్లుపై ఈనెల16 వ తేదీన ఢిల్లీలో బీసీ మహిళల పోరు దీక్షలు చేపడతామని,17న పార్లమెంటును ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మాజీ ఎంపీ వీ. హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీల జీవితాలతో చెలగాటమాడుతుందని కుల గణన చేస్తామని హామీ ఇచ్చి తీరా ఇప్పుడు చేయకుండా మోసం చేసిందని మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు వాటా ఇవ్వకుండా దగా చేస్తుందని ఆయన మండిపడ్డారు మహిళా బిల్లులో బీసీ మహిళల సబ్ కోట కోసం దేశంలోని అన్ని పార్టీలను కూడగట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీ కోట సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనా చారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వే షన్లు అమలు చేయడంలో కూడా బీసీలను మోసం చేసిందని, ఇప్పుడు మహిళా బిల్లు లు కూడా బీసీలకు అన్యాయం చేస్తుందని వారు ఆరోపించారు. బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న బీసీలకు కేంద్రంలో అన్యాయం జరుగుతూనే ఉండడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ బీసీలకు రాజకీయ ప్రాతిధ్యం కల్పించకపోతే చరిత్రలో బీసీ వ్యతిరేక పార్టీగా నిలిచిపోతుందని వారు హెచ్చరించారు. తక్షణమే మహిళా బిల్లులు బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
లేని పక్షంలో బీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం అయితామని వారు తెలిపారు. ఈ సమావేశానికి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ సమన్వయం చేయగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకల శ్యామ్, తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా నేతలు తారకేశ్వరి, శ్రావణి, శేఖర్ సగర, పిట్ల శ్రీధర్, దీటి మల్లయ్య, వీరస్వామి, సంధ్య, సుజాత, సిద్ధాంతం శ్యామల, స్వర్ణ గౌడ్, గౌతమి, గొడుగు మహేష్ యాదవ్, కౌలే జగన్నా థం, జిల్లల నరసింహ, గులాబీ శ్రీనివాస్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, ఉదయనేత, శివకుమార్, రవి, రత్నమాల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




