19-08-2025 01:53:12 PM
జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మానవాళికి మేలు చేసే మొక్కలను విరివిగా పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్(District Forest Officer Rajasekhar) అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ ఆవరణలో సామాజిక కార్యకర్త సురేష్ గుప్తాతో కలిసి మొక్కలు నాటారు.ఇటీవలి కాలంలో మొక్కలను నాటకపోవడం, అడవులను నాశనం చేయడం తదితర కారణాల వల్ల వాతావరణ అసమతుల్యం ఏర్పడుతుందని, ఇది భవిష్యత్తులో వాతావరణ సమతుల్యానికి అడ్డంకిగా మారుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆర్ డి ఓ కార్యాలయంలో మొక్కలు నాటడం, ప్రత్యేకించి కార్యాలయ ఆవరణ మొత్తం మొక్కలు నాటేందుకు పూనుకోవడం పట్ల ఆయన ఆర్ డి ఓ అశోక్ రెడ్డిని అభినందించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఇలాగే అందరు మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని అన్నారు. ఆర్డిఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, తమ కార్యాలయంలో మొక్కల పెంపకం తో పాటు, వాన నీటి సంరక్షణకు నీటి నిలువ కట్టడాలను ప్రోత్సహిస్తున్నామని, ఇందులో భాగంగా సోక్ ఫిట్ ను తవ్వడం జరిగిందని, దీనివల్ల వాననీరు భూమిలో ఇంకిపోయి భూగర్భ జలాలు పెరిగేందుకు ఆస్కారం ఉందని, కార్యాలయ ఆవరణ మొత్తం పూలు ,పండ్లను ఇచ్చే మొక్కలని నాటేందుకు నిశ్చయించడం జరిగిందని, దీని వలన చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సురేష్ గుప్త ఉన్నారు.