calender_icon.png 13 September, 2024 | 1:10 AM

ఉద్యమంలో జైలుపాలయ్యాం

18-07-2024 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెంలో మొదలైన నీళ్లు, నీధులు, నియామకాల ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా రగులుకొంది. ఆనాడు తెలంగాణలో ఉద్యోగం రావాలంటే ఆంధ్రావారు 14 సంవత్సరాలుగా తెలంగాణలోనే ఉంటున్నట్లు సర్టిఫికెట్ కలెక్టర్ నుంచి పొంది ఉండాలి. దీన్నే ముల్కీ అంటారు. అదే అదునుగా అనేక మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సర్టిఫికెట్లు పొంది తెలంగాణ యువతకు రావాల్సి ఉద్యోగాలను కొల్లగొట్టారు. అప్పుడే మా ఉద్యోగాలు మాకు కావాలని డిమాండ్ యువతలో నాటుకుపోయింది. నియామకాల పేరుతో మొదలైన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసింది. ఆనాడు మధన్‌మోహన్ నేతృత్వంలో తెలంగాణ  ప్రజాసమితి పేరుతో రాజకీయం రంగు పులుముకొని నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది.

ఈ ఉద్యమంలో అనేక మంది యువత, విద్యావంతులు ఆందోళన చేపట్టారు. కాసుబ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి హయాంలో జలగం వెంగళరావు హోం మంత్రిగా కొత్తగూడెం రావడం, శ్రీ రామచంద్ర ఆడిటోరియంలో ఆయనకు పౌరసన్మానం కాంగ్రెస్ పార్టీ చేయడంతో యువత మండిపడింది. 1969 ఆగస్టు ఐదవ తేదీన తలపెట్టిన  జలగం వెంగళరావు పౌరసన్మానాన్ని యువత వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసన తెలపడానికి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని విచ్ఛిన్నం చేయడానికి పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించి చివరకు కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 

ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ వీరోచిత పోరాటంలో కొత్తగూడెంకు చెందిన దస్తగిరి, రామ్‌చందర్‌లు మృత్యువాత పడ్డారు. కందుకూరి మధనయ్య, కొడెం కొమరయ్య, కొలను రాజారావు, మేకల సాంబయ్య, సత్యనారాయణ గాయాలపాలు కాగా వారిలో మధనయ్యకు బులెట్  దిగడంతో సింగరేణి ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడారు. ఆతర్వాత పాలకుల నిర్భందంతో ఉద్యమం కొంత సన్నగిల్లింది. 

అదే క్రమంలో 2001లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఇప్పటి భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో సుమారు 1200 మంది ఉద్యమకారులు అశువులు బాశారు. దీంతో కనువిప్పు కలిగిన కేంద్ర ప్రభుత్వం 2014, జూన్ రెండున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది.

 గుమ్మడవెల్లి వెంకట నర్సింహరావు,

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి 

ఉద్యమకారులకు ఆదరణ లేదు

నేను ఇరవై ఏళ్ల వయసులో తెలంగాణ స్టూడెం ట్ యాక్షన్ కమిటీ అధ్యక్షునిగా ఉద్యమంలో అడుగుపెట్టాను. పాల్వంచలో మొదలైన ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయం, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాకు పాకింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ తొలి ఉద్యమకారులకు ఎలాంటి ఆదరణ లభించలేదు. రామవరంలోని సబ్‌జైలులో మూడు నెలల పాటు వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచారు. ఉద్యమ కారులు అనేక మంది  దయనీయమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 ఉమ్మళ్ల శాంతరామ్

తీరని అన్యాయం జరిగింది

ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా, తెలంగాణ యువతకు న్యాయం చేయాలనే ఉద్యేశంతో తొలి, మలి దశ ఉద్యమాలు చేశాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు మాత్రం తీరని అన్యాయం జరిగింది. ఏ ఆశయంతో ఉద్యమాలు చేపట్టామో అది ఏమాత్రం నెరవేరలేదు. ఆనాడు, ఈనాడు అసలైన ఉద్యమకారులను గుర్తించిన నాధుడేలేడు. ఆ రోజుల్లోనే తాను డిగ్రీ పూర్తి చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిజమైన ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేస్తే బాగుంటుంది. 

 మహ్మాద్ చాంద్‌సాహెబ్

తొలి ఉద్యమంలో..

కేటీపీస్ కర్మాగారంలో ఆంధ్రావాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడంతో ఉద్యమానికి పునాది పడింది. 1969లో కేటీపీఎస్‌లో స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా ఆంధ్రావాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. యువత కన్నెరచేసి ‘జై తెలంగాణ’ అనే నినాదం మొదలైంది. అప్పడు  నా వయస్సు 21 సంవత్సరం, అప్పట్లోనే బీఎస్సీ పూర్తి చేశాను. స్థానికులు ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యమంలో చేరి పోరాటం చేశాను. కొత్తగూడెంలో జరిగిన కాల్పుల్లో తూట దిగింది. సింగరేణి ఆసుపత్రిలో చికిత్స చేయించి బతికించారు. ఇప్పటి వరకు తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. చిన్న వ్యాపారం చేస్తూ పిల్లల్ని చదివించాను. ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కనీసం ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించింది లేదు. ప్రభుత్వం కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాలకు తెలంగాణ ఫలాలు అందాలని తనతో పాటు అనేక మంది ఉద్యంలో కదం తొక్కారు. కానీ కనీస గౌరవం కూడా మాకు లభించలేదు.

కందుకూరి మదనయ్య