calender_icon.png 27 October, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీక్లీ విందులు..మంత్లీ మామూళ్లు!

27-10-2025 12:24:31 AM

-ప్రభుత్వ శాఖల్లో..పైకం కొట్టు.. పని పట్టు

-పైరవీకారులకు అడ్డగా మారిన దప్తర్లు

- మామూళ్లకు తలొగ్గుతున్న అధికారులు

బాన్సువాడ అక్టోబర్ 26 (విజయ క్రాంతి):  ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యే విధంగా ఉండే ప్రభుత్వ శాఖలు పైరవీ కారులకు అడ్డాగా మారిపోయాయి. దప్తర్లలో పైకం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు ఇతరత్రా అంశాలలో కూడా లబ్ధి పొందేందుకు ముందుగా పైరవీ కాలనీ కలవాల్సిన పరిస్థితి నెలకొంది. కాసులు ఇవ్వనిదే ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

అధికారులే స్వయంగా పైరవీ కార్లను కలవాల్సిందిగా సూచించడం గమనార్హం. నిరుపేదలు ప్రభుత్వ కార్యాలయాల్లో పైకం కొట్టలేక ప్రదక్షిణలు చేసే దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా ప్రజలకు నిత్యం ఉపయోగంలో ఉండే రెవిన్యూ, పోలీస్,రిజిస్ట్రేషన్ శాఖలో కూడా అవినీతి నీడలు కమ్ముకుంటున్నాయి. పట్టణ పల్లె ప్రగతికి దోహదపడే పంచాయతీరాజ్, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీలు కూడా అక్రమాలకు తావు ఏర్పడుతోంది.

 పర్మిషన్ కోసం పైకం కొట్టాలే...

 మున్సిపాలిటీలో పర్మిషన్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు అమ్యమ్యాలకు ప్రాధాన్యతనిస్తూ పర్మిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భవన నిర్మాణం కోసం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి.

పట్టణ అభివృద్ధిలో భాగంగా భవన నిర్మాణాలు బహుళ అంతస్తులు కాకుండా నిబంధనల మేరకే నిర్మాణాలు చేపట్టే విధంగా మున్సిపల్ కమిషనర్ అనుమతులను జారీ చేయాల్సి ఉంటుంది. అట్టి స్థల పరిశీలనతో పాటు భవనం ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారన్న విషయాన్ని పరిగణలో తీసుకొని నిర్మాణ అనుమతులను జారీ చేస్తారు. నిబంధనలు అటూ ఇటూ అయితే భవన యజమానుల నుండి మామూ లు ఆశిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

పట్టణాభివృద్ధిలో భాగంగా జరిగే అభివృద్ధి పనుల్లోనూ అధికారులు కాంట్రాక్టర్ల నుండి కాసులు దండుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నాణ్యతతో అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలి పనులు పూర్తి చేసినప్పటికీ నాణ్యతను పరిశీలించకుండానే బిల్లులు మంజూరు చేసేం దుకు అవకాశం కల్పిస్తున్నట్లు వాదన వినిపిస్తోంది. ఇవే కాకుండా మున్సిపాలిటీ శాఖ నుండి ఇతరాత్రా అనుమతులను పనులను పూర్తి చేసి పెట్టేందుకు పట్టణవాసులు చేతి చమరును వదులుకోవాల్సి వస్తోంది.

 రిజిస్ట్రేషన్ శాఖలో రైటర్లదే హవా..

 జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో రైటర్లది హవా కొనసాగుతోంది. రైటర్లు చెప్పింది తడువుగా రిజిస్ట్రేషన్ అధికారులు భూముల క్రయవిక్రయాల్లో లోపాలను సవరిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ల్యాండ్ వాల్యూను బట్టి  కొనుగోలు చేసిన వ్యక్తుల నుండి రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం ఎల్, అర్ రూపంలో కూడా ఫీజులను వసూలు చేస్తున్నారు. భూముల కొనుగోలు క్రయవిక్రయాల్లో రైటర్లు గోల్మాల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు వదంతులు వస్తున్నాయి. పలు సందర్భాల్లో సమయానుకూలంగా అసైన్డ్ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసే సాహసానికి ఒడిగట్టుకున్నట్లు సమాచారం.

 కేసులు వద్దు రాజీలే ముద్దు..

 ప్రభుత్వాలకు రక్షణగా నిలిచి పోలీస్ శాఖ ప్రతి ఫిర్యాదు వెనుక పోలీస్ అధికారులు పైకం దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. న్యాయం చేయండి మహాప్రభువుని వెళ్ళిన ప్రతి ఒక్క బాధితుల నుండి కానిస్టేబుల్ నుండి సీఐ స్థాయి అధికారుల వరకు ఇరు వర్గాల నుండి మామూలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వాహనాల తనిఖీలలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని వదంతులు వెలువెత్తుతున్నాయి.

జిల్లా ఉన్నతాధికారులు, డివిజన్ స్థాయి అధికారులు అవినీతికి దూరంగా ఉంటూ ఠానాలకు వచ్చే బాధితులకు న్యాయం చేయడంతో పాటు నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని సమీక్ష సమావేశాల్లో ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పోలీసుల్లో మార్పు రావడం లేదన్న విమర్శ సైతం లేకపోలేదు.

 నాణ్యతకు తూట్లు.. కాసుల కోసం అగచాట్లు 

 రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సక్రమంగా వినియోగించి నాణ్యతతో కూడిన ప్రగతి పనులను జరిపించాల్సిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు నాణ్యతకు తూట్లు పొడుస్తూ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారన్న వాదన ఉంది. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లతో మీలాకతై అధికారులు వారు చెప్పింది తడువుగా ఎంబీలు పూర్తి చేసి వారికి పనులను చక్కబెడుతున్నారు. జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యతను పరిశీలించే క్వాలిటీ కంట్రోల్ సెల్ అధికారులు కూడా తనిఖీలు జరపకపోవడంతో కాంట్రాక్టర్ల కు అధికారుల మధ్య వేరే సార్లు కుదురుతున్నట్లు ఆరోపణ ఉంది.

 అవినీతి నిరోధక శాఖ అధికారుల జాడెక్కడ..?

 ప్రభుత్వ కార్యాలయాల్లో అలుముకుంటున్న అవినీతిని  అడ్డుకట్ట వేయాల్సిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో దత్తర్లలో పైరవి కార్ల బెడద అధికమవుతుంది. ఇప్పటికైనా ప్రజలకు నిత్యం ఉపయోగపడే కార్యాలయాలతో పాటు ప్రగతి పనులు చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.