27-10-2025 01:27:31 AM
నిజాం పాలన, కుమ్రం భీం వీరత్వం యువత తెలుసుకోవాల్సిందే..
-ఆదివాసీ హృదయాల్లో చెరగని ముద్ర
-జీఎస్టీలో మార్పులు అన్ని వర్గాల్లో సంతోషం
-‘మన్‌కీ బాత్’లో భీంకు ప్రధాని మోదీ నివాళి
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఆదివాసీ పోరాట వీరుడు కుమ్రం భీం తెలంగాణ యోధుడని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 127వ మన్‌కీ బాత్‌లో ఆదివా రం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన నరేద్ర మోదీ కుమ్రం భీంకు నివాళులర్పించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో దేశ ప్రజలకు స్వాతంత్య్రం సుదూరస్వప్నంగా ఉండేదన్న మోదీ.. ఆ కాలంలో బ్రిటీష్‌వారి దోపిడీ, నిజాం నిరంకుశ పాలనను గుర్తు చేశారు.
అప్పట్లో తెలంగాణ, హైదరాబాద్ ప్రజలపై దమనకాండ తీవ్రంగా ఉండేదని, ఆదివాసీలకు జరుగుతున్న అన్యా యంపై, బ్రిటీషర్ల అకృత్యాలపై 20 ఏళ్ల వయసులో కుమ్రం భీం ఉద్యమించాడని మోదీ తెలిపారు. అత్యంత క్రూరమైన నిజాం పాలన-తోపాటు కుమ్రం భీం వీరత్వం గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిందేనని చెప్పారు. భారత్‌ను దోచుకోవడానికి బ్రిటిష్ పాలకులు అన్ని దోపిడీ మార్గాలను వాడారని, ఆ సమయంలో దేశభక్తి గల హైదరాబాద్ ప్రజల ప్రతిస్పందన వీరోచితంగా ఉండేదన్నారు.
బ్రిటిష్ వాళ్లు నిజాం పాలనను బలపరిచి... పేదలు, గిరిజనులపై నాడు జరిగిన వేధింపులు వర్ణనాతీతమని పేర్కొన్నారు. అలాంటి కష్టకాలంలో 20 ఏళ్ల కుర్రాడు ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడ్డాడని, ఆ కుర్రాడే కుమ్రం భీం అని తెలిపారు. నిజాంపై ఒక్కమాట మాట్లాడటం కూడా నేరమని భావించే ఆ కాలంలో ఆ కుర్రాడు నిజాం అధికారి సిద్ధిఖీని బహిరంగంగానే సవాల్ చేశాడని, అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని మట్టుబెట్టాడని వెల్లడించారు. కేవలం 40 ఏళ్లే బతికినా, ప్రజలపై చెరగని ముద్ర అతను వేశారని కొనియాడారు.
1940లో నిజాం సైనికులు ఆయన్ను హత్య చేశారని, కుమ్రం భీం గురించి తెలుసుకునేందుకు యువత వీలైనంత ప్రయత్నించాలని కోరుతున్నానని తెలిపారు. మరో ప్రముఖ గిరిజన నాయుకుడు భగవాన్ బిర్సా ముండా గురించి ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్, నక్సలిజం నిర్మూలన కోసం తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది పండుగలు మరింత ఉత్సాహంగా మారాయని మోదీ పేర్కొన్నారు. జీఎస్టీలో మార్పులు ఈ సారి పండుగ సీజన్‌ల్లో అన్ని వర్గాల్లో సంతోషాన్ని తీసుకువచ్చాయని ప్రధాని మోదీ అభివర్ణించారు.