19-05-2024 02:09:20 AM
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
వికారాబాద్, మే 18 (విజయక్రాంతి) : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శనివారం జిల్లాలోని పెద్దేముల్, తాండూరు, యాలాల్, బొంరాసిపేట్ మండలాల్లో పర్యటించి వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరు దిగాలు పడాల్సిన అవసరం లేదన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్‌చార్జిలను ఆదేశించారు. ఇప్పటికే సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకే తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా ధాన్యం తడవకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఇన్‌చార్జిలకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్ ఉన్నారు.