calender_icon.png 12 December, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగిస్తాం

12-12-2025 12:27:41 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట/హుస్నాబాద్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి):మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత బొమ్మ వెంకన్న  సామాజిక న్యాయం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతూ, రైతాంగానికి అండగా ఉంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన వెంకన్న జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.

బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం బొమ్మ వెంకన్న చేసిన పోరాటం తనకు విద్యార్థి దశలోస్ఫూర్తినిచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భంగా, ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష కాగా గౌరవెల్లి ప్రాజెక్టు సాధన కోసం బొమ్మ వెంకన్న చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.

* గౌరవెల్లి ప్రాజెక్టుకు వెంకన్న పేరు పెట్టాలి

గౌరవెల్లి ప్రాజెక్టుకు బీజం పడింది బొమ్మ వెంకన్న కృషి వల్లేనని, ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. స్థానిక రైతాంగం కోసం వెంకన్న చేసిన సేవలకు ఇది నిజమైన నివాళి అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకన్న కుమారుడు, రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి చిత్తారి రవీందర్, నాయకులు హసన్, వడ్డేపల్లి వెంకటరమణ, వీరన్న, పున్న సది, పద్మ, రాధ, సరోజన తదితరులు పాల్గొన్నారు.