15-06-2025 01:26:02 AM
- గద్దరన్న అంటే విప్లవం.. ఆయనొక వేగుచుక్క
- తెలంగాణ అభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుంది
- నంది అవార్డులను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే
-తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది
- ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించినా అది సినీరంగాభివృద్ధి కోసమే
-మీకు ఏం కావాలో నాకు చెప్పండి
- ఏ హోదాలో ఉన్నా సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా
- గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
- హైదరాబాద్ హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా వేడుక
-సందడి చేసిన సినీ ప్రముఖులు
ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమనూ తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని చెప్పారు. కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని, సినీరంగాభివృద్ధికి ఏం కావాలన్నా తనకు చెప్పా లని సూచించారు. తాను ఏ హోదాలో ఉన్నా సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని స్పష్టం చేశారు. గద్దర్ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై సినీకళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినిమా ప్రతిభను సత్కరిస్తూ నిర్వహించిన ఈ వేడుకను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎండీ హరీశ్, పలువురు అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈ వేదికపై అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన సావనీర్ పుస్తకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. “భారతీయ పరిశ్రమ అంటే బాలీవుడ్ అనేవారని, ఇప్పుడు తెలుగు సినిమాలను భారతీయ సినిమాలు అంటున్నారు. అందుకే ప్రస్తుతం సినీ పరిశ్రమ అంటే తెలుగు పరిశ్రమ అనేలా ఎదిగింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించాలని దిల్ రాజు సలహా ఇచ్చారు. మంచి కార్యక్రమం నిర్వహణకు సహకరించిన అందరినీ అభినందిస్తున్నా. సినీ పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుంది. నంది అవార్డులను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే.
కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి, 1964లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క. గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా. తెలంగాణ అభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది.
రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన దాదాపు అన్ని సినిమాలకు అవార్డులు ఇచ్చాం. కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. మీకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నేను మరో 22 ఏళ్లు క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. ఏ హోదాలో ఉన్నా సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీపరిశ్రమ అభివద్ధికి ఒక అధ్యాయం ఉంటుంది. 2047 నాటికి రాష్ట్రం ఎకానమీని 3 మిలియన్ డాలర్లకు చేరుస్తాం” అన్నారు.
గౌరవంగా ఉంది: విజయ్ దేవరకొండ
నట ప్రపూర్ణ కాంతారావు పేరిట ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2016లో పెళ్లిచూపులు చిత్రాన్ని రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందకు కృతజ్ఞతలు. పెళ్లిచూపులు చిత్రానికి నా హృదయంలో ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే ఈ గౌరవం, ఆనందం నా అభిమానులదే. వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉంది. నా ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబానికి, దర్శకులకు, టీమ్‌కు ధన్యవాదాలు.
గర్వంగా ఉంది: బాలకృష్ణ
ఎంతో మంది కళాకారులు మన ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ అవార్డును ప్రారంభించారు. చాలా మంది అవార్డులు అందుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ నేను ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నాకు ఈ అవార్డు ద్వారా ఇచ్చిన నగదు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్లే. నటనలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించిన నటుడు ఎన్టీఆర్. ప్రతీ తెలుగువాడు తెలుగు బిడ్డనని సగర్వంగా చెప్పుకొనేలా చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి బిడ్డనైనందుకు, అవార్డు అందుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. గద్దర్ అవార్డులు అందుకున్న అందరికీ నా శుభాకాంక్షలు.
తొలి అవార్డు అభిమానులకే: అల్లు అర్జున్
గద్దర్ అవార్డు వేడుక నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు. ఈ పురస్కారం నాకు దక్కిందంటే కారణం దర్శకుడు సుకుమార్. ఆయన వల్ల ఇది సాధ్యమైంది. ‘పుష్ప2’ టీమ్‌కు థ్యాంక్యూ. ‘పుష్ప1’ను హిందీలో విడుదల చేయాలని రాజమౌళి చెప్పకపోయి ఉంటే ఇంత క్రేజ్ ఉండేది కాదు. ఈ సందర్భంగా ఆయనకు థ్యాంక్స్. ‘పుష్ప2’కి గానూ నేను అందుకున్న తొలి అవార్డు ఇది. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా. ఈ వేడుక ప్రతి ఏడాదీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
గద్దర్ అవార్డ్స్ ఇలా..
మొదటి ఉత్తమ చిత్రం కల్కి 2898ఏడీ, రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, హిస్టరీ హెరిటేజ్ చిత్రం రజాకార్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఆయ్, ఉత్తమ పరిచయ దర్శకుడు యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు), ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ (కల్కి2898ఏడీ), ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప2), ఉత్తమ నటి నివేదా థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజుయాదవ్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (రజాకార్), ఉత్తమ నేపథ్య గాయకుడుసిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన నే చెబుతున్నా గీతం), ఉత్తమ హాస్యనటుడు సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా2), ఉత్తమ బాలనటుడు మాస్టర్ అరుణ్‌దేవ్ పోతుల (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్), ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి), ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్‌రెడ్డి (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి), ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (ఆయుధ పూజ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898ఏడీ), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కే చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి 2898ఏడీ)లకు అందజేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులు.. నటుడు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), నటి అనన్య నాగళ్ల (పొట్టేల్), దర్శకులు సుజీత్, సందీప్ (క), నిర్మాతలు ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజు యాదవ్), స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా2), తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం ‘మన సినిమా ఫస్ట్ రీల్’ (రెంటాల జయదేవ్), ఫిల్మ్ క్రిటిక్ : రవిచంద్రలకు అందజేశారు.
ఎన్టీఆర్ అవార్డ్ నేషనల్ అవార్డు నందమూరి బాలకృష్ణకు, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ మణిరత్నంకు, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ సుకుమార్‌కు, నాగిరెడ్డి ఫిల్మ్ అవార్డ్ అట్లూరి పూర్ణచంద్రరావుకు, కాంతారావ్ ఫిల్మ్ అవార్డ్ విజయ్ దేవర కొండకు, రఘపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ యండమూరి వీరేంద్రనాథ్‌కు అందజేశారు. వీటితోపాటు ౨౦౧౪ నుంచి ౨౦౨౩ వరకు విడుదలైన సినిమాల్లో ఉత్తమ తొలి, ద్వితీయ, మూడో చిత్రాలకు సంబంధించి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు అవార్డులను అందజేశారు.