27-10-2025 06:46:00 PM
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం వరంగల్ జిల్లా డిమాండ్..
హనుమకొండ/వరంగల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమం వరంగల్ జిల్లా అధ్యక్షులు వీరయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం వీరయ్య మాట్లాడుతూ 2024 మార్చి నుండి సెప్టెంబర్ 2025 వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వము 18 నెలల కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప ఎలాంటి ప్రయోజనములు అందించకపోవడం వల్ల అనేక విజ్ఞాపన పత్రములు ఇచ్చినప్పటికీ బకాయిలు అందచేయకపోవడం వల్ల విసిగి, వేసారి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన, ధర్నా చేపట్టామన్నారు.
మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన రిటైర్మెంట్ బకాయిలు జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ,జిఐఎస్,లీవ్ ఎన్ క్యాస్మెంట్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, పిఆర్సీ ఏరియర్స్, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవులు, డి.ఏ.ఏరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వెంగల్ రెడ్డి,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్రు సుధీర్ బాబులు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావలసిన బకాయిలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురియై ఇప్పటివరకు 20 మంది అనారోగ్యంతో బాధపడుతూ, మనోవేదనతో అసువులు బాసిన వాళ్లు కూడా ఉన్నారని, ఒక ఉపాధ్యాయుడు బకాయిలు రాలేదని మానసిక వేదనతో ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బకాయిలు (బెనిఫిట్స్) సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, శ్రీదర్ల ధర్మేంద్ర మాట్లాడుతూ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రిటైర్మెంట్ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక పిల్లల పెండ్లిళ్ళు చేయలేక, ఇండ్లు కట్టుకోలేక, పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు కట్టలేక, బ్యాంకు ఈఎంఐలు కట్టలేక మానసిక వేదనతో అనేక మంది రోగాల బారినపడి వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతూ, రావలసిన బకాయిల కోసం ఎదిరిచూస్తున్నారు అని అన్నారు. పెన్షనర్ల భాదను గౌరవ ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ రిటైర్ అయిన 12,000 మంది, కుటుంబాలను కాపాడాలని కోరారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో బకాయిల సాధన కమిటీ నాయకులు, ఎస్జీపిటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య, ఎండి. మహబూబ్ ఆలీ,ఎండి గఫార్, సదానందం, ఏ.వేణుమాధవ్,క్రిష్ణమూర్తి, కృష్ణకుమార్,సారంగపాణి, సమ్మయ్య, కుమారస్వామి, పెద్దన్న, అశోక్ కుమార్,మెకిరి దామోదర్, కె.వి చలం,బి. సారయ్య వనజ,రమాదేవి, పలువురు ఎస్పిజిటిఏ సభ్యులు దాదాపు 200 మంది వరకు పాల్గొన్నారు.