క్రీడా పోటీల్లో మేము పాల్గొనం: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 27(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని సమయం వృథా చేయడం తగదని స్పష్టం చేశారు. మేము ఎమ్మెల్యేలుగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనబోమని కేటీఆర్ వెల్లడించారు.
సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కనబెట్టి, అర్థాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం ప్రజలు సమర్థించరని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా ఈ క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలని సూచించారు.
హైదరాబాద్ జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించిన విమెన్స్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్-4 కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటుడు సాయి కుమార్, బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, మహిళా వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన కేటీఆర్, విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు.




