సీఎం పర్యటనను అడ్డుకుంటాం: బీఆర్‌ఎస్ నేతల హెచ్చరిక
గద్వాల్, జూన్ 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో చేపడుతున్న పర్యటన అభివృద్ధి కోసం అయితే గద్వాల నియోజక వర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
బుధవారం గద్వాల పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు, కేశవ్ మాట్లాడారు. నియోజకవర్గంలో ర్యాలంపాడు, ఘట్టు ఎత్తిపోతల పథకం, నెట్టం పాడు ప్రాజెక్టు పెండింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జూరాల, గుడ్డెందొడ్డి ప్రాజెక్టులను సందర్శిస్తున్న సమయంలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.
నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సీఎం పర్యటన కొనసాగితే నిరసనలు చేపట్టి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. గద్వాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టుల పనులు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, వాటి పూర్తి కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోవెంకటేశ్వర్ రెడ్డి,రాఘవేంద్ర రెడ్డి,చిత్తరి కిరణ్, నాగర్ దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, బీచుపల్లి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






