31 March, 2026 | 3:18 AM

ఎల్‌పీజీ గ్యాస్ కొరతను అధిగమిస్తాం

31-03-2026 01:32 AM
  1. ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు సరఫరాను పెంచాలి

నౌకల ఆలస్యంతోనే కొరత

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి 

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రికి లేఖ

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ ఆధారిత వాహనాలకు గ్యాస్ కొరత ఉన్నందున ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణా సేవలను మ రింతగా విస్తరించేందుకు ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎల్‌పీజీ గ్యాస్ కొరతతో ఆటోలతో సహా గ్యాస్ ఆధారిత వాహనాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై సోమవారం మంత్రి   పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా చేస్తున్న ప్రధాన పంపిణీ దారులతో సచివాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ ర వీంద్ర,హైదరాబాద్ కలెక్టర్ హారిచందన తో పాటు  ఐఓసీఎల్,  గోగ్యాస్, ఫ్రెంచ్ కీ చెందిన టోటల్ ఎనర్జీ లతో పాటు సూపర్ గ్యాస్, ప్రమ్ గ్యాస్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.  మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు సంస్థలతో ఏర్పడి న కొరతను భర్తీ చేయడానికి గాను ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావాలన్నారు.

వాహనాలకు సరఫరా చేసే ఎల్‌పిజి గ్యాస్ సరఫరాలో ఏర్పడ్డ  సంక్షోభాన్ని నివారించేందుకు  సరఫరాలను పెంచాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు వు శాఖ మంత్రి హార్డిప్ సింగ్ పూరీకి లేఖ రాయలని పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను మంత్రి ఆదేశించారు. అదే సమయం లో గ్యాస్ ఆధారిత ఆటో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిని పారదర్శకంగా వివరించాలని ఆయన సూచించారు.

గ్యాస్ ఆధారిత ఆటోలతో పాటు ఆటోలకు రోజువారీగా 202 టన్నుల గ్యాస్ అవసరం ఉండగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సంక్షోభంతో రోజు వారీగా 147 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నదన్నారు. రోజూ వారి లోటు 55 టన్నులు ఉండగా ఆ కొరత మొత్తం ప్రైవేటు రంగంలో కనిపిస్తోందన్నారు. ఆటో ఎల్‌పిజి సరఫరాలో 75 శాతం వాటాను  ప్రైవేటు సంస్థలు కలిగి ఉన్నాయని చెప్పారు.

ఐఓసిఎల్ మాత్రమే తాను రోజు వారీగా సరఫరా చేస్తున్న 35 టన్నుల కోటాను 23 ఔట్ లెట్ల ద్వారా సరఫరా చేస్తుందన్నారు. సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీ, ప్రయిమ్ గ్యాస్ వంటి సంస్థలు మార్కెట్‌లో ప్రధాన పంపిణీ దారులుగా ఉన్నారని, ఇందులో ప్రభుత్వ వాటా మొత్తం 25 నుండి 30 శాతం వరకే కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 116 ఔటర్ రింగ్ రోడ్డు లోపట, బయట 27 తో కలిపి మొత్తం 143 ఉండగా అందులో 23 ఔట్ లెట్లు పనిచేయడం లేదన్నారు. వాటిలో 17 నగరం నడిబొడ్డున ఉన్నాయన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ యుద్ధ వాతావరణం ఇంధన వనరుల మీద కనిపిస్తుందని, ఎల్‌పిజి దిగుమతి చేసే నౌకలు రెండు నుంచి మూడు రోజులు ఆలస్యంగా వస్తుండటంతో ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రవైట్ సంస్థలు కృష్ణపట్నం, మహారాష్ట్ర లోని జైఘడ్, ముంబై లతో పాటు తమిళనాడు రాష్ట్రల టెర్మినల్స్ నుంచి బల్క్ ఎల్.పి.జీ నీ సేకరిస్తున్నాయన్నారు. కొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ అంతర్జాతీయ వనరులను పరిశీలిస్తున్నాయని అయితే ఖచ్చితమైన సమయం చెప్పలేమని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.