10-02-2025 12:00:00 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మరో ఏడాదిలో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు గెలుపొంది బల్దియాపై కాషాయం జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అహంకారపూరిత మజ్లిస్ పార్టీ కోరలు పీకేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీ నగర సెంట్రల్ అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి ప్రమాణ ఆదివారం నగర కార్యాలయం బర్కత్‌పురాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో బీజేపీ వరుసగా విజయదుందుభి మోగిస్తుందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో పటిష్టంగా ఉందన్నారు.
మరో ఏడాదిలో జరగనున్న జీహెఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించుకునేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా లంకల దీపక్‌రెడ్డిని కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సత్కరించారు.