మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక ఉత్సవాలు
అలరించిన కర్ణాటక గాత్రం, భరతనాట్య ప్రదర్శనలు
శేరిలింగంపల్లి, జూలై 12 (విజయక్రాంతి): హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రం శిల్పారామం మాదాపూర్లో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం కర్ణాటక గాత్ర కచేరి భరతనాట్యం ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని హర్షధ్వానాలతో అభినందించారు.కర్ణాటక గాత్ర కచేరి కాలిఫోర్నియా నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన యువ గాయని కుమారి రిద్ధి కొప్పుల తన సుమధుర గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.అన్నమయ్య కీర్తనలు, స్వాతి తిరునాళ్ కృతులు, భద్రాచల రామదాసు త్యాగరాజ స్వామి కృతులను భక్తి భావంతో ఆలపించారు.
ఆమె గాత్రంలోని స్పష్టత, భావప్రకటన ప్రేక్షకులను ఆకర్షించింది.భరతనాట్యం ప్రదర్శన గౌతమీ నృత్యాలయం నాట్య గురువు గౌతమీ రవి చంద్ర శిష్య బృందం భరతనాట్యం ద్వారా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దివిజ, హిమవర్ష, తన్వి, అనన్య, స్వర, పూజిత, రష్మిక, నిహారిక, కౌశిక ఇతర కళాకారులు పుష్పాంజలి, గజాననయుతం, మూషిక వాహన, శ్రీ రామ, నటేశ కౌత్వం, గరుడ గమన, బొమ్మ బొమ్మ, శ్యామల మీనాక్షి, చిన్ని శిశువు, అచ్యుతం కేశవం, జతిస్వరం, సతులారా, తిల్లాన వంటి వివిధ అంశాలను అత్యంత నైపుణ్యంతో, లయబద్ధంగా ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. వారి భంగిమలు, అభినయం, తాళ జ్ఞానం ప్రేక్షకుల నుంచి అమితమైన ప్రశంసలు అందుకున్నాయి.
ఈ కార్యక్రమం ద్వారా సాంప్రదాయిక కళారూపాలను యువతరం ఎంతో ఉత్సాహంతో కొనసాగిస్తున్నట్లు స్పష్టమైంది. శిల్పారామం అధికారులు నిర్వహిస్తున్న ఇలాంటి వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్ నగర సాంస్కృతిక వారసత్వాన్ని మరింత సమృద్ధి చేస్తున్నాయని స్థానికులు,కళాభిమానులు అభినందించారు.






