calender_icon.png 7 July, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూబే దుమారం!

23-04-2025 12:00:00 AM

అధికార వికేంద్రీకరణ ప్రధానాంశంగా భారత రాజ్యాంగం పని చేస్తుంది. శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియాల్లో దేని విధి దానిది. పరిధిని అతిక్రమించి వీటిలో ఒక దానిపై మరొకటి అజమాయిషీ చేయకూడదని రాజ్యాంగం చెపుతున్నది. అయితే, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ తమ పరిమితులు దాటితే వాటిని సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉంటుంది.

తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య తలెత్తిన ప్రతిష్టంభనపై కేసు ఇలాంటిదే. గవర్నర్లు బిల్లులను ఆమోదించడంలో మార్గదర్శకాలు ఏవైనా ఉన్నాయా? గవర్నర్లు తమ రాజకీయ పక్షపాతంతో రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడితే ఏం చేయవచ్చు? ఇంతకాలం ఇవి ప్రశ్నలుగానే ఉన్నాయి. బిల్లుల ఆమోదానికి ఇటు గవర్నర్లు, అటు రాష్ట్రపతి నిర్ణీత గడువును పాటించాలనే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో పెద్ద చర్చ మొదలైంది.

శాసనవ్యవస్థపై సుప్రీంకోర్టు రాజ్యాంగం 142వ అధికరణాన్ని ఉపయోగించడం అణ్వస్త్రాన్ని ప్రయోగించడమేనని, శాసనవ్యవస్థ కంటే సుప్రీంకోర్టు ఉన్నతమైందని ఎలా భావిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ చాలా అసహనంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ వర్మల వంతు. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడుతూ అగ్నికి ఆజ్యం పోశారు.

తమిళనాడు ప్రభుత్వానికి విజయాన్నిచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై అక్కసును వెళ్లగక్కారు. దూబే వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని స్వయాన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. నోరు పారేసుకోవడంలో దిట్ట అయిన దూబే అంతటితో ఆగలేదు. వక్ఫ్ సవరణ చట్టం కేసులపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పు పట్టారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఆయన వదల్లేదు. మరోవైపు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించిన మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీని ‘ముస్లిం కమిషనర్’ అని వివక్షాపూరితంగా సంబోధించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రజాప్రతినిధులకు శిక్షలుండవు. బారా ఖలాన్ మాఫీలా ఉంటుంది చాలా సందర్భాల్లో. దూబే లాంటి వారి వ్యాఖ్యలకు ఆయా పార్టీలు దూ రంగా ఉన్నట్లు చెప్పుకున్నా, ప్రజల స్పందనను ఒక గాటన కట్టేందుకు ఇ లాంటి వ్యాఖ్యలు ఉపయోగపడక పోతాయా అనేదే పార్టీల భావనగాఉంటుంది.

పార్టీ లైన్‌ను దాటిన ఇలాంటి వారిపై పార్టీ పరంగా చర్యలుం టాయా అంటే, అలాంటి సందర్భాలు తక్కువే. ఇంతటితో అయిపోలేదు. బీజేపీ ఐటీ విభాగం రంగం మీదికి వచ్చింది. న్యాయవ్యవస్థకు సూపర్ పవర్ ఉండదని, అది శాసనవ్యవస్థను సమీక్షించడమేమిటని ఇందిరాగాంధీ గతంలో ప్రశ్నించారని, గతాన్ని మరువకూడదని కాంగ్రెస్‌కు హెచ్చరిస్తూ బీజేపీ ఐటీ విభాగాన్ని నిర్వహించే అమిత్ మాలవీయ సోమవారం ఒక వీడియో బయటపెట్టారు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో జరిగిన అవినీతి, అకృత్యాలపై అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

విచారణ అధికారం జస్టిస్ షాకు ఎవరిచ్చారనేది ఇందిరాగాంధీ ప్రశ్న. 21 నెలల ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ, మానవ హక్కుల హననం ఎలా  సాగింది జస్టిస్ జయంతలాల్ చోటీలాల్ షా తమ నివేదికలో బయటపెట్టారు. మాజీ ప్రధాని ఇందిరకు ఇది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘రాజకీయాల్లో ఏం జరుగుతున్నదో జస్టిస్ షాకు ఏం తెలుసు? అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆయనకు తెలుసా?

ఒక జడ్జి ఈ విషయంలో తీర్పు నివ్వగలరా? మరి ప్రజాస్వామ్యం ఉన్నది ఎందుకు?’ ఇవీ ఆనాడు ఇందిరాగాంధీ వేసిన ప్రశ్నలు. దూబే వ్యాఖ్యలపై విమర్శలను బీజేపీ ఈ వీడియోతో తిప్పి కొట్టాలని ప్రయత్నిస్తున్నది. ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యానికి మంచివేనా అనేదే అసలు ప్రశ్న.