calender_icon.png 7 July, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మభాషకు తోడుగా.. ఆంగ్లోపాసనే ధ్యేయంగా!

23-04-2025 12:00:00 AM

భాష ఒక సమాచార వితరణ కేంద్రమే కాదు, అది సాంస్కృతిక, మేధో వారసత్వ మాధ్యమం కూడా. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా, దాదాపు 150 కోట్లమంది ప్రజలు మాట్లాడే భాషగా ఆంగ్లానికి పేరుంది. వివిధ దేశాలు, సంస్కృతులు, ప్రాంతాల ప్రజలను ఏకం చేసే సాధనంగా ఇంగ్లీష్ భాషకు ప్రత్యేక గుర్తింపూ ఉంది. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచ ప్రజలను కలుపుతున్న ఏకైక మాధ్యమంగా ఆంగ్లభాష అమూల్య సేవలను అందిస్తున్నది.

ఐరాస (ఐక్యరాజ్యసమితి) ఎంపిక చేసిన రెండు వర్కింగ్ భాషల్లో ప్రెంచ్‌తోపాటు ఇంగ్లీష్ భాషకూడా ఉంది. 2010లో ఐరాస తీసుకున్న నిర్ణయం ప్రకారం సంస్థ ఎంపిక చేసుకున్న 6 అధికార భాషల్లో అరబిక్, చైనీస్, ప్రెంచ్, స్పానిష్‌తోపాటు ఇంగ్లీష్ కూడా ఉంది. ఈ ఆరు భాషలకు ఒక్కొక్క దినోత్సవాన్ని నిర్ణయించి పాటించడం జరుగుతున్నది. ఇదే క్రమంలో ఇంగ్లీషు భాషకు చెందిన విలియమ్ షేక్‌స్పియర్ జన్మదినం, వర్ధంతి (ఒకే రోజు) సందర్భంగా 2010 నుంచి ప్రతి ఏట ఏప్రిల్ 23న ‘ఆంగ్ల భాషా దినోత్సవం’ (ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే) పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. 

ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల భాషా నిపుణుడు విలియమ్ షేక్‌స్పియర్ 23 ఏప్రిల్ 1564న జన్మించి, అదే నెల, అదే తేదీన 1616లో కన్నుమూశారు. ‘ఆంగ్ల భాషా దినోత్సవం’ వేదికగా విద్యాలయాల్లో ఆంగ్ల ఆధార్ పోటీలు, షేక్‌స్పియర్ నాటకాల ప్రదర్శనలు, సృజనాత్మక రచనలపై కార్యశాలలు, ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు, భాష ఆధార క్రీడలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు వంటివి నిర్వహిస్తారు.

ప్రపంచ ప్రజలను కలిపే ముఖ్యమైన వారధి అయిన ఆంగ్లభాషను నేర్చుకోవడం, నైపుణ్యం సాధించడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వంటి నిర్ణయాలను ఈ సందర్భంగా తీసుకొని ముందుకు సాగుదాం. మన మాతృభాషతోపాటు అంతర్జాతీయ భాష ఇంగ్లీషునూ సొంతం చేసుకుని ప్రగతిపథంలో దూసుకెళదాం. 

- డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి