02-08-2025 02:34:51 AM
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): నిధుల దుర్వినియోగం, టిక్కెట్ల విక్రయంలో అవకతవకలు, ఫోర్జరీ సంతకాలతో అడ్డదారిలో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందడం వంటి ఆరోపణలతో సీఐడీ అరెస్టు చేసిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్ రామచంద్రన్, కోశాధికారి శ్రీనివాస్‌లను హెచ్‌సీఏ సస్పెండ్ చేసింది. అయితే తాత్కాలిక అధ్యక్షుడు దల్జిత్ సింగ్, అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న ఈ అత్యవసర నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే.
కానీ నిందితులపై వేటు వేయడంలో ఎంపిక పద్దతి ఎంచుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి అవరోధంగా మారిన ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడితోనే ఆగిపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్‌రావు, రామచంద్రన్, శ్రీనివాస్‌లతో సమానంగా మిగిలిన ఆఫీస్ బేరర్లు కూడా అవినీతిలో భాగస్వాములుగా ఉన్నట్టు అధికారిక దర్యాప్తు నివేదికలు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల ఆధారంగా స్పష్టమవుతుంది.
అయినా అపెక్స్ కౌన్సిల్ మౌనం వహిస్తుండటం అనుమానాలకు తావిస్తుంది. మాజీ అధ్యక్ష ట్రెజరర్లతో సహా బోర్డులోని మరికొందరు వ్యక్తులు నిధుల దుర్వినియోగం, ఆస్తుల దుర్వినియోగం, నిధుల మళ్లింపు, చారిత్రాత్మక క్రికెట్ జ్ఞాపకాలు అదృశ్యం కావడానికి కారకులుగా ఉన్నారు. అయినప్పటికీ వారు ఇంకా అదే వ్యవస్థలో పనిచేస్తూ బోర్డు ఎన్నికలు, ఎంపికలను ప్రభావితం చేస్తున్నారు.
క్లబ్ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడంతో పాటు బినామీ సభ్యత్వాల ద్వారా ప్రాక్సీ ఓట్లను నియంత్రిస్తున్నారు. ఏసీబీ విచారణలో భాగంగా నిధుల దుర్వినియోగంలో 30 మందికి పైగా వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఈ జాబితాలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, అసోసియేషన్‌లో ఇప్పటికీ నియంత్రణ కలిగి ఉన్న సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికే సీఐడీ కస్టడీలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకుని, మిగిలిన వారిపై దృష్టి సారించకపోవడం చర్చకు దారి తీస్తుంది. అయితే హెచ్‌సీఏ అవినీతిపై లోతైన దర్యాప్తు జరిగితే అపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులు కూడా బయటపడే ప్రమాదం ఉందనే ఈ రకంగా కుట్రపూరితంగా వ్యవహరింస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏసీబీ నివేదికపై ఎప్పుడూ పూర్తి స్థాయిలో చర్య తీసుకోలేదు. హెచ్‌సీఏ టికెట్ల కుంభకోణంపై మాత్రమే సీఐడీ ప్రస్తుతం దృష్టి సారించింది. నిధుల దుర్వినియోగంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆసక్తికరంగా బీసీసీఐ నుంచి గుర్తింపు పొందాలని కోరుకునే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సీఐడీ అధికారులకు అధికారిక ప్రకటన అందించింది.
దీనిలో తెలంగాణ జిల్లాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించే ముసుగులో రూ.12 కోట్ల కుంభకోణం జరిగిందని టీసీఏ ఆరోపించింది. దీనికి తోడు నిజమైన క్రికెట్ ప్రేమికులు హెచ్‌సీఏలోని నిధుల దుర్వినియోగాన్ని ఎందుకు సహించాలని, తెలం గాణ జిల్లాల నుంచి ఆశావహ ఆటగాళ్ళు ఎందుకు బాధపడాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి దర్యాప్తు నివేదికలు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో పేర్లు కనిపించే వారందరినీ సస్పెండ్ చేయాలి.
కానీ వారిని పదవిలో కొనసాగించడం పాలనను అపహాస్యం చేయడమేననే వాదన వినిపిస్తుంది. దీంతోపాటు గత కొన్ని దశాబ్దాలుగా హెచ్‌సీఏ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖర్చు చేసిన ప్రతి రూపాయి, పంపిణీ చేసిన ప్రతి గ్రాంట్, నిధులు సమకూర్చిన ప్రతి టోర్నమెంట్‌ను పరిశీలనలోకి తీసుకురావాలి. అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకుని ఆటగాళ్లు, అభిమానులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.