calender_icon.png 2 August, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిజంలో ఓనమాలు తెలియనోళ్లున్నారు

02-08-2025 02:32:57 AM

  1. సోషల్ మీడియా పేరుతో జర్నలిజం ముసుగులో తిరుగుతున్నారు 
  2. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కమ్యునిస్టుల పాత్ర కీలకం
  3. భవిష్యత్‌లోనూ కాంగ్రెస్, కమ్యునిస్టులు కలిసి పనిచేయాలి 
  4. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అబద్ధాల ప్రతిపాదికన పనిచేయొద్దని నిర్ణయించుకున్నా 
  5. సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ 

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ‘జర్నలిజంలో ఓనమాలు తెలియని కొంత మంది జర్నలిస్టు ముసుగు వేసుకొని సోషల్  మీడియా పేరుతో తిరుగుతున్నారు. అలాం టి వారిని సీనియర్ జర్నలిస్టులు పక్కన పెట్టాలి. కనీసం వారిని పక్కన కూర్చోబెట్టుకోకూడదు. అవారాగా రోడ్ల మీద తిరుగు తూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం శోఛనీయం.

తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పని చేస్తున్నాయి. దీంతో జర్నలిజం అనే పదానికి అర్థం లేకుండా పోతోం ది. ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాని ఆనాడైనా.. ఈనాడైనా కమ్యునిస్టుల సహకారం ఎంతో ఉంది.

2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఆనాడు విద్యుత్ ఉద్యమాలను లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కమ్యునిస్టులేనని నమ్ముతున్నా. 2023లో మేం అధికా రంలోకి రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కమ్యునిస్టులు చేసిన పాదయాత్రలు, పోరాటాలు కారణంగా కావొచ్చు. భవిష్యత్‌లోనూ కాంగ్రెస్, కమ్యునిస్టుల మధ్య సహ కారం ఇలానే కొనసాగాలి. ప్రజా పాలనను కొనసాగించడానికి కూడా మీ సహకారం కావాలి’ అని సీఎం తెలిపారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కమ్యునిస్టులు ఉప్పులాంటి వారని, ఉప్పులేని వంట రుచి ఉండదన్నా రు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించినప్పుడే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పని చేస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

తనకు మొదటి నుంచి  కమ్యునిస్టులంటే అపారగౌరవన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు గలమెత్తాలన్నా.. అధికారంలో ఉన్న వాళ్లను గద్దె దింపడానికి కమ్యునిస్టులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. అబద్ధాల ప్రతిపాదికన రాజకీయాలు చేయొద్దని తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నట్టు చెప్పారు.  

ప్రజల పక్షాన నిలబడే పత్రికలు కొన్నే

నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పని చేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని పత్రికా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తిందని, స్వాతంత్య్ర పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఉప యోగపడ్డాయన్నారు. నాటి సాయుధ రైతాంగ పోరాటంలో సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పత్రికలు పని చేశాయన్నారు.

ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ పాలకులు ఎవరైనా ప్రజల పక్షంగా పత్రికలు పని చేయాలని సీఎం సూచించారు. గతంలో తమ భావజాలాన్ని ప్రజల కు వివరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలు నడిపేవని, కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడతో వ్యవ హరిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్ట్ పదాన్ని నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని సీఎం రేవంత్‌రెడ్డి వాపోయారు.

గతంలో తాము ప్రెస్‌మీట్ నిర్వహించినప్పుడు సబ్జెక్టుపై జర్నలిస్టులతో వివరాలు తీసుకునే వాళ్లమని, కానీ ఇవాళ వింత పోకడలు వచ్చాయని, ఈ వింత పోకడలకు రాజకీయ పార్టీలు తోడయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, రాజకీయ నాయకుల్లో విశ్వసనీ యత తగ్గినట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోంద న్నారు.

అందుకే నిజమైన జర్నలిస్టులు దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన తక్షణ పరిస్థితి ఏర్పడిందని సీఎం అభిప్రాయపడ్డారు. నిజమైన జర్నలిస్టులు, జర్నలిస్టు ముసుగు తొడుక్కున్న వారిని జర్నలిస్టులే వేర్వేరు చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే దేశ భద్రతకే ప్రమాదరకంగా మారే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.