15 August, 2026 | 2:18 PM

ఆ ల్యాప్‌టాప్‌లో ఏముందో?

25-05-2024 12:30 AM

అందులోని సమాచారాన్ని రాబట్టే పనిలో ఏసీబీ

అనుమతి కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు

తవ్వేకొద్ది బయటపడుతున్న ఏసీపీ ఆస్తుల చిట్టా

ఇప్పటికే బయటపడ్డ ఆస్తులు రూ.50 కోట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి): అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఆస్తుల చిట్టా ఎంతకూ ఆగటం లేదు. ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించిన ఆయన ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ రూ.౫౦ కోట్లు దాటిందని సమాచారం. తన మొత్తం అక్రమాస్తుల వివరాలను ఉమామహేశ్వర్‌రావు ఓ ల్యాప్‌టాప్‌లో భద్ర పరిచినట్టు గుర్తించారు. దాన్ని ఆన్‌చేసి అందులో ఏముందో తెలుసుకొనేందుకు ఏసీపీని వారం రోజులపా టు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారు లు నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వర్‌రావు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు ఇదివరకే గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 17 స్థిరాస్తులు, ఘట్కేసర్‌లో 5 ప్లాట్లు, శామీర్‌పేట్‌లో ఓ విల్లా, వైజాగ్‌లో విలువైన స్థలం, ఇంట్లో రూ.37 లక్షల నగదుతోపాటు 60 తులాల బంగా రు నగలు, కిలోలకొద్ది వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసు కొన్నారు.

రెండు బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. 1995 సబ్ ఇన్‌స్పెక్టర్ బ్యాచ్‌కు చెందిన ఉమామహేశ్వర్‌రావు అబిడ్స్, జవహర్‌నగర్, సీసీఎస్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌గా, ఇబ్రహీంపట్నం, సీసీఎస్ ఏసీపీగా పని చేశారు. ఇటీవల సీసీఎస్ ఏసీపీగా పలు కీలక కేసుల్లో విచారణ అధికారిగా పెద్ద మొత్తంలో అవినీతి సొమ్మును కూడా బెట్టినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉమామహేశ్వర్‌రావు డైరీలో చాలామంది పేర్లు ఉన్నట్లు గుర్తించారు.  

కస్టడీ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా

ఏసీపీ ఉమామహేశ్వరావు కేసును మరింత లోతుగా విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీ కొరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.