13-06-2024 12:05:00 AM
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరుణంలో జమ్మూ, కశ్మీర్‌లో వరసగా మూడు రోజుల్లో మూడుసార్లు ఉగ్రదాడులు జరగడం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం యాత్రికులే లక్ష్యంగా ప్రైవేటు బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రియాసీ జిల్లాలో ఈ దాడి జరిగింది. అది మరువక ముందే మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఇంటి యజమాని గాయపడ్డారు.
సమా చారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చేరుకుని నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు. ఎదురు కాల్పుల్లో ఓ సీఆర్‌సీఎఫ్ జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన కొద్ది గంటలకే అర్ధరాత్రి సమయంలో దోడాజిల్లాలోని భదర్వా పఠాన్‌కోట్ రహదారి సమీపంలోని ఓ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు పలురౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు భద్రతా సిబ్బంది. ఓ పోలీసు అధికారి గాయపడ్డారు.
ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హీరానగర్ సెక్టార్‌లోని ఇంటిపై కాల్పులు జరపడానికి ముందు పాక్‌నుంచి చొరబడినట్లగా భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టులు పలు ఇళ్లకు వెళ్లి తాగేందుకు నీరు అడిగినట్లు తెలుస్తోంది. దాంతో గ్రామస్థులకు అనుమానం రాగా అది గ్రహించిన ఉగ్రవాదులు ఓ ఇంటిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు స్థానికులు చనిపోయినట్లు తొలుత వార్తలు రాగా పోలీసులు ఆ వార్తలను ఖండించారు. పూంఛ్, రాజౌరీ, దోడా జిల్లాలతో పోలిస్తే రియాసీ జిల్లాలో ఉగ్రవాద ఘటనల తీవ్రత తక్కువ . అయితే అలాంటి ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు పంజా విసురుతుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనల తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేశామని, రాష్ట్రమంతటా శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కశ్మీర్‌లో తాజా ఘటనలపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారనిఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. ‘పాక్ నేతల ప్రకటనలపై స్పందించడానికి మోడీకి సమయం ఉంది కానీ కశ్మీర్ ఘటనలపై స్పందించడానికి సమయం లేదా?’ అని ప్రశ్నించారు.
కశ్మీర్‌లో ఎన్నికలు జరపడం గురించి బీజేపీకి ఆలోచన లేనట్లు కనిపిస్తోందని కూడా ఆయన అన్నారు. టెర్రరిస్టుల దాడులకు అమాయకులు బలవుతున్నా బీజేపీ ప్రభుత్వం మాత్రం అంతా బాగుందనే పాతపాటే పాడు తోందని దుయ్యబట్టారు. అయితే భద్రతా అధికారులు మాత్రం కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరగడం వెనుక పాక్ కుట్ర ఉందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరపాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో కశ్మీర్‌లో శాంతి భద్రతల సమస్య సృష్టించి తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించాలనేది పాక్ ఆలోచన అని వారంటున్నారు.
ఈ ఏడాది జూన్ 29న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే వాస్తవానికి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే సమయంలో ఉగ్రదాడుల ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 2017 జులైలో అమర్‌నాథ్ యాత్రనుంచి తిరిగి వస్తున్న భక్తులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు యాత్రికులు చనిపోగా, మరో 15 మంది గాయపడ్డారు. అంతకు ముందు ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో యాత్రను నిలిపివేసిన ఘటనలూ ఉన్నాయి. తర్వాతి కాలంలో భక్తులపై పెద్దగా దాడులు జరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రభుత్వం, భద్రతా దళాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.