13-06-2024 12:05:00 AM
'ఊడిపోయే జుట్టు ఎంత ఒత్తిన ఏముందిలే’ అంటారు ప్రముఖ కవి సినారె. అయ్యవార్లు లేక, రీసర్చ్ గ్రాంట్లు, బ్లాక్ గ్రాంట్స్ లేక శ్మశాన ప్రశాంతత నెలకొన్న విశ్వవిద్యాలయాల్లో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లని యూజీసీ ఆర్భాటంగా ప్రకటించింది. గత పదేళ్లుగా దేశంలోని యూనివర్సిటీల్లో చలనం లేకుండా పోయింది. వాటి పరిస్థితి సమీక్షించుకుంటే అశాంతి, అలజడు లు, సుదీర్ఘ పోరాటాలకు ప్రధాన కారణం బోధనా సిబ్బంది నియామకాలే అని అర్థమవుతుంది. బోధన, పరిశోధన, క్రమ శిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అధ్యాపకులను నియమిం చాల్సిందే. విశ్వవిద్యాలయాలకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది.
విద్యారంగంలో అత్యంత కీలకం తరగతి బోధనేనని ఉపకులపతులు గ్రహించాలి. విద్యార్థులపై తర గతి బోధన విధానం తీవ్ర ప్రభావం చూపుతుంది, అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రభావితం చేసే విధంగా బోధన విధానాలు, సామర్థ్యాలు పెంచుకోవాలి. పరీక్షల్లో అనేక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉంది, అలాగే వివిధ వర్సిటీల్లో అమలులో ఉన్న పరీక్షల విధానాన్ని సమగ్ర అధ్యయనం చేసి విద్యార్థుల కు లాభం చేకూర్చే పద్ధ్దతిని ప్రవేశపెట్టాలి. విద్యా విధానంలో నాణ్యత తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా పాలన, ఆర్థిక వనరుల కేటాయింపు, పరిశోధన ప్రగతి, ఏపీఐ స్కోర్, పెర్ఫామెన్స్ బేస్డ్ అకడమిక్ స్కోర్వంటి కీలకాంశాలు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఉన్నత విద్యాధికారులు ప్రైవేటు వర్సిటీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తూ వీటిలో సీట్లు భర్తీ అయిన తర్వాత మొక్కుబడిగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో సీట్ల భర్తీ జూన్ నెలలో ముగుస్తుంది. ఇక్కడ సెప్టెంబర్ అయినా అడ్మిషన్ ప్రక్రియ మొదలు కాదు. పరిస్థితి ఇలాగే ఉంటే 2030 నాటికి దేశంలో 80 శాతం ప్రైవేటు విశ్వవిద్యాలయాలే ఉంటాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీసం ముప్పు శాతం సీట్లు భర్తీ కాక మూసివేశారు. డిప్లొమా విద్యలో ఇంకా దారుణంగా కేవలం 35 శాతమే అడ్మిషన్లు అయ్యాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వర్సిటీలకు స్వేచ్ఛ అవసరం
వర్సిటీలకు మరింత స్వేచ్ఛను అందించినప్పుడే ఉన్నత విద్య, పరిశోధన రంగం లో నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే దేశీయ విశ్వవిద్యాలయాలు విద్య, పరిశోధనా రంగంలో అంతర్జాతీయ విద్యా సంస్థలతో పోటీ పడాలంటే రీసెర్చ్ గ్రాంట్లు, మైనర్, మేజర్ ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి. సెంటర్ ఆఫ్ పొటెన్షి యల్ ఎక్సెలెన్స్ ఉన్న విభాగాలు ఇప్పుడు యూనివర్సిటీల్లో ఒక్కటీ లేదు. ఉన్నత విద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు తక్కువగా ఉంటున్నాయి. స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉన్నత విద్యారంగానికి కేటాయించే నిధులు పెంచడంతోపాటు వివిధ మార్పులకు అవకాశం కల్పించాలి.
సమూల మార్పులు జరగాలి
విశ్వవిద్యాలయాలు గుర్తింపులు ఇవ్వడాన్ని రద్దు చేసి, పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకు వచ్చినప్పుడు విద్యారంగంలో నాణ్యతతో కూడిన ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్యారంగానికి దశాబ్దం క్రితం వరకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అవి సమాజ ఉన్నతికి దోహదపడే విధంగా ఉండాలి. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, సిలబస్ నిర్ణయించడం, అమలులోకి తీసుకు రావడంలో అధ్యాపకుడి పాత్ర ప్రధానంగా ఉండి, జ్ఞానం, నైపు ణ్యం, విలువలు పెంచేదిగా విద్యాప్రణాళిక ఉండాలి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధ్యాపకులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వీటిలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించడానికి ప్రైవేటు కన్సల్టెన్సీలు ఉన్నాయి. లోపం ఎక్కడుందో గ్రహించకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. విద్యార్థిని కేంద్రీకృతం చేసుకొనే పద్ధతి ఈనాడు అవసరం. సాంకేతిక విశ్వవిద్యాలయాల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలూ బలోపేతం కావాలి. కొత్తగా ప్రవేశ పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ అంశాలు అధ్యాపకులు బోధించడానికి వీలుగా అకడమిక్ స్టాఫ్ కాలేజీలు లేవు. పరిశోధన ప్రాజెక్టులు కొన్ని మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి.
కారణం నిధులు నిలిపివేయడం లేదా తగ్గించడం. ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్యా ప్రమాణాలుతో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదు. అజ్ఞాన సమాజంలో వికృత రూపాలతో సామాజిక సంక్షోభం రాబోతున్నది. ఇప్పుడైనా ప్రభుత్వ సలహాదారులు, విద్యా రంగంలో నిష్ణాతులు, మేధావులు, ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మంచి జీతాలు ఇచ్చి పర్యవేక్షణ ఏర్పాటు చేసి విలువలతో కూడిన విద్యా ప్రమాణాలను తీసుకొని రావాలి. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు లేవు. అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు అంతకంటే లేవు. 50 ఏళ్ల క్రితం వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ స్టాఫ్ కాలేజీలు మూతపడి దశాబ్దం అయింది. రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవెలప్‌మెంట్ కోర్సులు అన్నీ అనియత విద్య లాగా టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు.
విద్యాలయాలంటే భవంతులు కాదు
విద్యాలయాలంటే బిల్డింగులు, స్థలాలు కాదు. అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధపడడం లేదు. పరీక్షలు సకాలంలో జరపరు. ఫలితాలు వెల్లడించరు. పీహెచ్‌డీ వైవా జరపరు. పరిస్థితి ఇలా ఉంటే మరో రెండేళ్లలో యూనివర్సిటీలు శాశ్వతంగా మూతపడ్డం ఖాయం. కాషాయీ కరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ ప్రధానంగా సమాన విద్యావకాశాలు లేని నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు. విద్య ఉద్దేశ్యం పూర్తి మానవ సామర్థ్యాన్ని సాధించడం, సమానమైన న్యాయమైన సమాజాన్ని అభివృద్ధి చేయడం అని విద్యా విధానంలో పేర్కొన్నప్పటికీ, గ్రామీణ భారతదేశంలోని అట్టడుగున ఉన్న మెజారిటీ ప్రజల అవసరాలు తీర్చడంలో అది విఫలమైంది.
పరిశోధన, ప్రజా జోక్యాల ద్వారా వివిధ సామాజిక-, ఆర్థిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనడమే కాకుండా వినూత్న ఆలోచనలు, ఆర్థిక వ్యవస్థలను పరిపక్వం చేస్తుంది. వాస్తవానికి, విద్యా విధానం ప్రత్యేకించి విద్యాసంబంధ పరిశోధనలకు ఆర్థిక సహాయం చేయడంలో నిబద్ధత లేదు. కళ, భాష, సంస్కృతి, సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం ఇతర విషయాలలో పరిశోధనలు చేపట్టడానికి తగిన సంస్థాగత నిధులు లేకపోవడంతో ఇది విఫలమైంది. స్పేస్, సైన్స్ టెక్నాలజీ రంగంలో కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. అవి ప్రత్యేక ప్రయోజన సంస్థలు.
దారి చూపే నక్షత్రం
జాతీయ విద్యా విధానం 2020 అనేది విద్యా వ్యవస్థలో గణనీయమైన నిర్మాణాత్మక మార్పులను సిఫార్సు చేసే ఒక లేయర్డ్ డాక్యుమెంట్. ప్రాథమిక విద్య కోసం ఆలోచనలు, మొత్తంగా పట్టణ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు దారి చూపే నక్షత్రం వలె పనిచేస్తుంది. కానీ ఉద్దేశపూర్వకంగా లేదా కమిటీ సభ్యుల పరిమిత అవగాహనతో, నూతన విద్యా విధానం సమకాలీన గ్రామీణ భారతదేశ సంక్లిష్టతను విస్మరించింది. నాణ్యత లేని విద్య గ్రామీణ పౌరుల జీవితాలను దెబ్బతీస్తుందనే వాస్తవాన్ని ఇది మరిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ప్రధానంగా వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆదివాసీ సమూహాల పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాల యాల ను బలోపేతం చేయకుండా ఏడాదంతా ప్రవేశాలు పెట్టినా లాభం లేదనే విషయాన్ని పాలకులు గ్రహించాలి.
డా. యం. సురేష్ బాబు
అధ్యక్షుడు, ప్రజాసైన్స్ వేదిక