calender_icon.png 6 May, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా చిరునామా ఏదీ?

06-05-2025 12:00:00 AM

  1. నూతన పంచాయతీ కాలేదు.. తీర్మానమైన పేరూ గాయబ్ 
  2. గూగుల్‌లో అడ్రస్ దొరకదు.. లైవ్ లొకేషన్‌తో గమ్యం చేరం
  3. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం 
  4. పేరు కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్న అల్గునూర్ శివారు కాలనీ

కరీంనగర్, మే 5 (విజయక్రాంతి) : మానేరు డ్యాం పరివాహక ప్రాంతంలో అలుగు పుట్టిందని ఆ ఊరికి అలుగునూర్‌గా నామకరణం చేశారు. ఏటా విస్తరించిన అల్గునూరులో కొత్తకొత్త వాడలు, ప్రాంతాలు పుడితే వాటికి నామకరణం చేశారు. అదే అలుగునూరులో ఉన్న నాకు మాత్రం నామకరణం చేయలే.. నా ఏరియా పేరేంటి? నాకు గుర్తింపు ఏది? నేనేం పాపం చేశానని 40 ఏళ్లుగా నాకు పేరు పెట్టలేదు..

అలుగునూర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో, శివారులో పుట్టడమే నేను చేసిన పాపమా? ఇప్పటికీ నా ఏరియాకు నిర్దిష్ట అధికారిక గుర్తింపు పేరు లేదు. బర్త్ సర్టిఫికెట్ లేదు. ప్రపంచంలో ఏ అడ్రస్‌నైనా తెలుసుకునే గూగుల్‌లో కూడా నా చిరునామా దొరకదు. లైవ్ లొకేషన్ పెట్టిన నా ఏరియా గమ్యస్థానానికి చేరుకోలేరు. నా ల్యాండ్ మార్క్ ఎస్సారెస్పీ కార్యాలయాలనో, టీచర్ ట్రైనింగ్ సెంటర్ (డైట్), మహిళా ప్రాంగణం, అల్గునూరు సబ్ స్టేషన్,

మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసో,  ఎల్‌ఎండి కాలనీకి దగ్గర, డ్యాం కింద చేపలు అమ్మే ప్రాంతం, పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ కమాన్ , ఈనాడు ఆఫీసు దాటిన తర్వాత వచ్చే డ్యాం కాల్వ కింది ప్రాంతమని.. ఇలా అడ్రస్ చెప్తేనే జాడ తెలుసుకోవచ్చు. అసలు 40 ఏళ్లుగా నాకు పేరు లేక గుర్తింపులేక పడుతున్న వ్యథ, ఆవేదన ను  తెలుసుకోవాలంటే నా స్టోరీ మీరు చదవాల్సిందే.

పూటకో పేరు మార్పు...

నాలుగు దశాబ్దాల కిందట లోయర్ మానేరు డ్యాం కింద జీవనోపాధి పొందుతున్న కొందరు మత్స్యకారులకు అప్పటి ఎమ్మెల్యే జగపతిరావు ఇంటి స్థలాల పట్టాలిచ్చి, అక్కడి ప్రాంతానికి కేశవనగర్ పేరు పెట్టారు. ఆ కేశవనగర్ పేరు వివాదాస్పదమైంది. ఆ పేరుతో పెట్టిన శిలాఫలకం ధ్వంసమైంది. ప్రస్తుతం నన్ను ఫిషర్‌మెన్ కాలనీ, చేపల కాలనీగా పిలుచుకుంటున్నారు.

ఇక్కడే స్థానికంగా ఉంటూ జీవనోపాధి పొందుతున్న కొంతమంది తమిళులకు ప్రభుత్వ ఇళ్లకు పట్టాలిస్తే  ఆ ఏరియాకు తమిళ కాలనీ అని కూడాపేరు  పెట్టుకున్నారు. ఆ ప్రాంతంలోనే 2000లో వినాయకుని గుడి కట్టి వినాయకనగర్‌గా పిలుస్తున్నారు. ఈ రెండు పేర్లు ఉన్నా 2005లో వినాయకుని గుడి పక్కన ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలకు కాకతీయ కాలనీ అని నామకరణం చేశారు.

అందులో ఉన్న అంగన్వాడి కేంద్రానికి అల్గునూరుొ2 అని నామకరణం చేశారు. ఇదంతా నా ఏరియాలో గవర్నమెంట్ ఇళ్ల పట్టాలు, ప్రభుత్వ పాఠశాలల ఏరియాలో ఉన్న  చిరునామా పేర్ల పరిస్థితి. ఆపై నా ఏరియాలో కొత్తగా ప్లాట్ల వెంచర్లు వచ్చాయి. ఎస్సారెస్పీ విశ్రాంత ఉద్యోగులు, ఇతరత్రా ప్రజలు  భూములు ప్లాట్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏరియా విస్తరించింది.. వాడలు పెరిగాయి. 

మొదట్లో కొందరు ‘సంగం గడ్డ’, చర్లపురం ఏరియా పేర్లతో పిలిచారు. వాడలకు ఏదో ఒక పేరు ఉండాలనే ఆలోచనతో ఆయా ఏరియాల్లో వాడల్లో ఉండే ప్రజలు, కొంతమంది స్థానిక నాయకుల ఆలోచనలతో అడ్రస్సు ,చిరునామా గుర్తింపు కోసం వాడలకు పేర్లు పెట్టారు. గతంలో ఇక్కడ ఉన్న వినాయక నగర్, చేపలకాలనీ, కాకతీయకాలనీ,తమిళకాలనీలు ఉంటే.. కొత్తగా వెలిసిన వాడలతో హుస్సేన్‌నగర్, క్రిస్టియన్‌కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీలు ఏర్పడ్డాయి.

మొత్తంగా అలుగునూర్‌లో ఏక నామకరణంతో నన్ను గుర్తించే పేరు లేకపోయిన, నా ఏరియాలో అంతర్గత వాడల్లో ఇన్ని పేర్లు ఉన్నాయని సంబురపడ్డ. కానీ, వాడల్లోని ఇన్ని పేర్లలో దేనికి ఏ పేరుకు అధికారిక గుర్తింపు ఉందో తెలియని పరిస్థితి. ఇక్కడి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల కాకతీయ కాలనీ పేరు మీద ఉంటే, అదే పాఠశాల ప్రాంగణంలో ఉండే అంగన్వాడీ కేంద్రం అలుగునూరు -2 పేరుపై పెట్టారు.

ఇక్కడి ప్రాంతంలో శంకుస్థాపనలకు ఏ పేరు అవసరమైతే ఆ పేరు పెట్టుకుని మమ అనిపించారు. ఇక్కడి ప్రజల సమస్యలు, ఇబ్బందుల కోసం ఏరియాలోని పేర్లను ఏ అధికారికి, ప్రజా ప్రతినిధులకు తెలియజేసిన కొత్తగా ఈ వాడ, ఏరియా పేర్లను వింటున్నాం.. ఎప్పుడు వినలేదే.. అలుగునూరు కింద ఇన్ని పేర్లతో కాలనీలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు.