calender_icon.png 6 May, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

06-05-2025 12:56:31 AM

  1. రాష్ట్రంలో అద్భుత రహదారుల నిర్మాణం ప్రధాని మోదీ ఘనతే
  2. లక్ష కోట్లతో గ్రీన్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టాం
  3. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
  4. ఆదిలాబాద్‌లో రూ.3,900 కోట్ల విలువైన ఎన్‌హెచ్‌లు, జంక్షన్లు జాతికి అంకితం
  5. హాజరైన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, 
  6. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 5 (విజయక్రాంతి): తెలం గాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణలో రహదారులు అద్భు తంగా చేసిన ఘనత నరేంద్ర మోదీదే అని తెలిపారు. మరో మూడేళ్లలో రెండు లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తా మని హామీ ఇచ్చారు.

  రూ.3,900 కోట్ల వ్యయంతో నిర్మిం చిన మంచిర్యాల-వాంకిడి (మహారాష్ట్ర సరిహద్దు), ఎన్ హెచ్ 363 ఫోర్ లేన్ రోడ్, నిర్మల్-ఖానాపూర్ ఎన్‌హెచ్ 61 రెండు లేన్ల రోడ్, నాగ్‌పూర్- హైదరాబాద్ ఎన్‌హెచ్ 44 రహదారిలో అండర్‌పాస్, జంక్షన్‌లను కేంద్ర మంత్రు లు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ధనసరి సీతక్కతో కలిసి ప్రారం భించారు.

అనంతరం కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్ సమీపంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మిఅధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గడ్కరీ మాట్లాడారు.. జల సంరక్షణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీన్‌దయాళ్ స్ఫూర్తితో కేంద్రప్ర భుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు వివరించారు.

గూడు, తిండి, గుడ్డ లేని పేదవారికి సేవలందించడమే రాజనీతి అని తెలిపారు. చీకటి ప్రాంతంలో వెలుగులు నింపేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రైతులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా దేశంలోని రహదారుల అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. 

రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం..

తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు 5 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల వేశామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. గడ్చిరోలి జిల్లాకు అనేకసార్లు వెళ్లానని, ఆ జిల్లాకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు. ‘మన రైతు కేవలం అన్నదాతగా కాకుండా సాంకేతికతను అందిపుచ్చుకొని అన్ని రకాలుగా ఎదగాలి.

నీళ్లను నిల్వ చేయండి.. ఇంటి నీళ్లు ఇంటి వద్ద.. పొలం నీళ్లు పొలంలోనే.. గ్రామంలోని నీళ్లు గ్రామంలోనే స్టోరేజ్ చేసుకోవాలి’ అని  సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులలో నీటిని స్టోరేజ్ చేసుకునేలా ప్రణాళిక చేసుకోవాలని తెలంగాణ సీఎంకు సూచిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమే, ఇంకా అసలు సినిమా ముందుందన్నారు. 

తెలంగాణలో లక్ష కోట్లతో గ్రీన్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీనగర్ జమ్మూ మధ్యలో 36 టన్నెల్‌లు నిర్మిస్తున్నామని, కశ్మీర్ నుండి కన్యాకుమారి రహదారి కల నెరవేరుతుందని, తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, విజయవాడ మీదుగా రహదారి వస్తుందన్నారు.  మేడారం రహదారి విస్తరణకు పనులు చేస్తామని, నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు ఆరు వరసల జాతీయ రహదారి మంజూరు చేస్తామని తెలిపారు. 

అంకితభావంతో పనిచేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసిన ఘనత ప్రధానమంత్రి మోదీ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి దక్కుతుందన్నారు. రోడ్డు, రైల్ కనెక్టివిటీ కోసం కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ఇండస్ట్రియల్ పరంగా వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

రామగుండంలో 8 వందల మెగావాట్ల పవర్ ప్లాంట్, 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు యూరియా పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేలకోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అభివృద్ధి చేస్తున్న విషయాన్ని వివరించారు.

వెనుకబాటుకు గత ప్రభుత్వాలే కారణం: కేంద్రమంత్రి బండి సంజయ్ 

గత ప్రభుత్వాలు, పాలకుల కారణంగానే ఈ ప్రాంతం వెనుకబాటు జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రహదారుల నిర్మాణానికి రూ.1,25,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

గతంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకుందని పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వల్ల ఏ విధంగా ప్రాంతం వెనుకబడ్డదో ప్రజలు  గమనించారన్నారు. ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలు తర్వాత కలసి పనిచేస్తేనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 

అభివృద్ధికి సహకరిస్తాం: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డ్డి 

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. మారుమూల జిల్లాలకు సైతం జాతీయ రహదారుల నిర్మాణం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల రహదారుల నిర్మాణం చేయడంతో పాటు హైదరాబాద్‌లోనూ ఫ్లై ఓవర్స్ వేయవలసి ఉందన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు.

జోడేద్దుల్లా అభివృద్ధికి పాటుపడదాం: జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి జోడెద్దుల కలసి పని చేద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ పేదరికం తో పాటు అభివృద్ధిలోనూ వెనుకబడి ఉందన్నారు. రోడ్ల అనుసంధానంతో అభివృద్ధి సాధ్యమవుతుందని దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రహదారులను మంజూరు చేయాలని కోరారు. 

రహదారుల అనుసంధానం గొప్ప నిర్ణయం.. 

రహదారుల అనుసంధానం గొప్ప నిర్ణయమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ చెప్పారు. అదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వరకు, ఆళ్లపల్లి నుంచి ఆసిఫాబాద్ వరకు జాతీయ రహదారి మంజూరు చేయాలని కోరారు. ఉట్నూర్ నుంచి జన్నారం, అదిలాబాద్ నుంచి రాజుర, చంద్రపూర్ నుంచి రాజుర, బోకర్ నుంచి నాందేడ్‌కు జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. 

జిల్లాలో అటవీ ప్రాంతం అధికంగా ఉండడంతో రోడ్డు నిర్మాణాలకు ఫారెస్ట్ అనుమతులు రాక ఇబ్బందిగా మారుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. రెబ్బెన మండలం 12 గ్రామాలకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్ వద్ద  బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.

ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టితే 12 గ్రామాలకు రవాణా సులభతరం అవుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మా బోజ్జు, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు

ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం కాగజ్‌నగర్ క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే 363 మంచిర్యాల- నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు రూ.3,526 కోట్ల వ్యయంతో 94.6 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు వరుసల రహదారి, నిర్మల్--ఖానాపూర్ మధ్య రూ.127 కోట్లతో 17.79 కిలోమీటర్ల రెండు వరుసల నేషనల్ హైవే 61కు, నేషనల్ హైవే 44 నాగపూర్--హైదరాబాద్ మధ్యలో రూ.29 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్ నిర్మాణం, నాగ్‌పూర్-హైదరాబాద్ మధ్యలో రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన సర్వీస్ రోడ్లు, జంక్షన్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు. ఎన్‌హెచ్ 44 నాగ్‌పూర్--హైదరాబాద్ మధ్యలో రూ.173 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు, ఆర్మూర్--జగిత్యాల--మంచిర్యాల ఎన్‌హెచ్-63పై రూ.29 కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఫోర్‌లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.