06-05-2025 12:46:48 AM
లేదంటే నన్ను కోస్క తింటరా? తింటే ఏమొస్తది?
హైదరాబాద్, మే 5 (విజయ క్రాంతి): ‘రాష్ట్రప్రభుత్వ ఆదాయం నెలకు రూ.18,500 కోట్లే.. నన్ను కోసినా కూడా రూపాయి ఆదాయం రాదు.. లేదంటే నన్ను కోసుకుని తింటరా? తింటే ఏమై నా వస్తదా? ఏ బ్యాంకూ మనల్ని నమ్మ డం లేదు. ఢిల్లీలో ఎవరూ మనకు అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు. దొంగలు చెప్పులు ఎత్తకపోతరేమో అన్నట్లు చూస్తున్నరు. నేను ఎక్కడికి వెళ్లినా ప్రత్యే క ఫ్లుటైలో వెళ్లొచ్చు.
కానీ.. నేనాపని చేయ డం లేదు. ఎకనామీ క్లాస్‌లోనే ఫ్లుట్లైలో తిరుగుతున్న. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పాటు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉద్యోగులంతా కలిపి కేవలం 2శాతం మాత్రమే ఉంటారు. ప్రజలు 98శాతం ఉంటారు. మనం వారికి సేవ చేసేందుకు ముందు కు రావాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నరు. ఇప్పుడు కావాల్సింది సమరం కాదు.. సమయస్ఫూర్తి.
మనం పాలకులం కాదు.. సేవకులం. ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తమంటున్నరు? మీ సమరం మాపైనా? లేదా ప్రజలపైనా? రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రతి నెలా ఒక టో తారీఖునే జీతం ఇస్తున్నందుకా సమ రం? ఇక నేనేం చేయలేను. ప్రతిపక్షాల ఉచ్చులో పడి ఉద్యమిస్తామని అంటున్నరు. వారి కుట్రలో భాగస్వాములు కాకండి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించి మా చేతిలో పెట్టింది.
అందుకు మూలమైన వ్యక్తి ఇప్పుడు హాయిగా ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నడు. మేం మాత్రం అప్పులకు మిత్తీలు కట్టుకుంటూ వస్తున్నం. ఉద్యోగులారా.. మనమంతా ఒక కుటుంబం. మన పరువును బజారున పడేయొద్దు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌లో సోమవారం ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘పోలీస్ రియల్ హీరోస్’ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 16 నెలల తమ పాలనలో తాము రూ. 1.58 లక్షల కోట్ల అప్పులు తెచ్చామని, గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిత్తీలకు ఇప్పటివరకు రూ.1.52 లక్షల కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు.
అంతకు మించి ఒక్కరూపాయి మిగిలినా ఉద్యోగులు చూపించాలని సూచించారు. తెచ్చిన అప్పులో ఒక్క రూపాయి కూడా తాము వాడుకోలేదని, ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేశామని వ్యాఖ్యానించారు. నాటి సీఎం కేసీఆర్ 11 శాతం వడ్డీకి తెచ్చారని, అలా పాలకుడూ చేయడని అభిప్రాయపడ్డారు.
అప్పులకే రూ.7 వేల కోట్లు..
తిన్నా తినకున్నా ప్రతి నెలా సర్కార్ రూ.7 వేల కోట్ల అప్పు చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.8,500 కోట్ల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలు అలాగే ఉన్నాయని వెల్లడంచారు. కొన్ని బీఆర్‌ఎస్ నేతలు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి ఆ పెండింగ్ బిల్లులన్నీ వారి హయాం నుంచే ఉన్నాయని వివరించారు.
ఇంత సంక్షోభంలోనూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు రైతులకు సంబంధించిన రూ.30 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేశామన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. ప్రభుత్వం, ఉద్యోగులుఎ అండగా నిలబడాల్సిన అవసరం ఉందని, ఉద్యోగులకు ఏమైనా సమస్యలుంటే చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రజలపై యుద్ధం చేసి బాగుపడినవారెవరూ లేరని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని హితవు పలికారు. ఉద్యోగులు కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు.
బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చని, కానీ ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారమని స్పష్టం చేశారు.
శాంతిభద్రతలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు..
తెలంగాణ పోలీసులు నూటికి నూరుశాతం శాంతిభద్రతలు కాపాడుతున్నారని సీఎం అభినందించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ యావత్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. దేశ సరిహద్దుల్లో సైనికుల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదని, విధి నిర్వహణలో ప్రతి పోలీస్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు కుటుంబాలకు ప్రభుత్వం భరోసా అందిస్తున్నదని వివరించారు. విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీల కుటుంబాలకు రూ.కోటిన్నర చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు.
పోలీస్ పిల్లల భవిష్యత్ కోసం 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించామని, వారికి మంచి భవిష్యత్ అందించే బాధ్యత ప్రభుత్వానిదని వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్రంలో యాంటీ నార్కొటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామని, సైబర్ నేరాల నియంత్రణపైనా ప్రత్యేక దృష్టి సారించి.. ఆ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.